మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శంకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్పై అలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని, వీర్లపల్లి శంకర్ తక్షణమే ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమని కానీ అవి కేవలం రాజకీయాల వరకే పరిమితం కావాలని దానం నాగేందర్ స్పష్టం చేశారు. “ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం ఆయన స్థాయికి తగిన మాటలు కావు. వ్యక్తిగతంగా ఒక నాయకుడి మరణాన్ని కోరుకోవడం చాలా దారుణమైన విషయం” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గురించి ఎవరైనా చెడు కోరుకుంటే, అంతిమంగా ఆ చెడే వాళ్లకు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ ఆ తర్వాత పదేళ్ల అభివృద్ధిలోనూ కేసీఆర్ పాత్ర కీలకమైనదని దానం నాగేందర్ గుర్తుచేశారు. దశాబ్దాల తరబడి ఆయన గడించిన అపారమైన అనుభవం, సేవలు తెలంగాణ ప్రజలకు ఎంతో అవసరమని అన్నారు.
Also Read:ప్రోటీన్ పౌడర్లో పురుగులు..నటి ఫిర్యాదు!

