తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుండటంతో, రాగల రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. ముఖ్యంగా ఆదిలాబాద్,కుమ్రం భీమ్ ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేశారు.
Also Read:ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు..నటి ఫిర్యాదు!
వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, విద్యుత్ స్తంభాలు మరియు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.

