బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 10వ సీజన్ తొలివారంలోనే ఊహించని షాక్‌లతో దూసుకుపోతోంది. ఐదో రోజు ఆరో ఎపిసోడ్‌లో భాగంగా ఉహించని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. సాధారణంగా మొదటి వారం ఎలిమినేషన్ ఉందో లేదో అని సందేహించే కంటెస్టెంట్లకు బిగ్ బాస్ వరుసగా ఇద్దరిని ఎలిమినేట్ చేసి వణికించారు. నిన్నటి ఎపిసోడ్‌లో చరణ్ అవుట్ కాగా సెప్టెంబర్ 11.. 6వ ఎపిసోడ్‌లో చైత్ర కూడా ఇంటి నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఈ మహా సంగ్రామంలో ఇకపై ఎలాంటి టీమ్‌లు ఉండవని, ఎవరి ఆట వాళ్లే ఆడాలని స్పష్టం చేస్తూ బిగ్ బాస్ అసలు ఆట మొదలుపెట్టారు.
హౌస్‌లో ‘నస స్టార్’గా పేరు తెచ్చుకున్న త్రిగుణ్ రోజుకో కంటెస్టెంట్‌ని ఎంచుకుని బ్రెయిన్ వాష్ చేసే పనిలో పడ్డాడు. అమన్ దగ్గరకు వెళ్లి, “రోహిత్‌తో గొడవలో నువ్వు గట్టిగా నిలబడటం వల్లే అతను హైలైట్ అయ్యాడు. నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయర్‌వి, నీకు ఎవరూ లీడర్ కాదు” అంటూ అమన్ బుర్ర తినేశాడు. అంతేకాకుండా, గిన్నెలు కడిగే విషయంలో రోహిత్‌తో అనవసర గొడవకు దిగాడు. త్రిగుణ్ డబుల్ స్టాండ్స్ పై ముఖేష్ గౌడ, సుధీర్, ఝాన్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ముందేమో ఒంటరిగా ఆడాలంటాడు, తీరా టాస్క్ వచ్చేసరికి అందరికీ అవకాశం ఇవ్వాలని స్పీచ్‌లు ఇస్తాడు. మైండ్ నుంచి ఆలోచించేవాడే ఇలా ఫ్లిప్ చేసి మోసం చేస్తాడు” అని ముఖేష్ అతని నకిలీ ఆటను ఎండగట్టాడు.
నో రిస్క్ జోన్ లోకి వెళ్లేందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఈజీ, హార్డ్ టాస్క్‌లను ఇచ్చారు. ‘రన్ రాజా రన్’ అనే ఈజీ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలక్‌గా వ్యవహరించగా, సృష్టి విషయంలో అతను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాస్ జోక్యం చేసుకుని సృష్టికి న్యాయం చేశారు. ఈ టాస్క్‌లో రాం ప్రసాద్ గెలిచి ‘నో రిస్క్’ సాధించడమే కాకుండా, అమన్‌ను ‘హై రిస్క్’లోకి నెట్టాడు.
మరోవైపు కేక్ టాస్క్‌ను ఆడిన సుధీర్, వర్షిణిలు “మేమిద్దరం గెలిచి హౌస్‌మేట్స్ అయ్యాం” అని బిగ్ బాస్ చెప్పని డ్రామా ఆడటానికి ప్రయత్నించారు. అయితే రాం ప్రసాద్, వంశీ, ముఖేష్‌లు వీరి ప్లాన్‌ను ముందే కనిపెట్టేశారు. ముఖేష్ హౌస్‌మేట్స్ అందరి ముందు వీళ్ల నాటకాన్ని బయటపెట్టడంతో, బిగ్ బాస్ సీరియస్ అయి సుధీర్, వర్షిణి ఇద్దరినీ ‘హై రిస్క్’ జోన్‌లోకి పంపారు.
హై రిస్క్‌లో ఉన్న వర్షిణి, సుధీర్, అమన్, చైత్రలలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కే అప్పగించారు. వర్షిణి, అమన్, సుధీర్‌లు చైత్ర అన్‌ఫిట్ అని ఓటు వేశారు. చైత్ర తనకు తగినంత అవకాశం రాలేదని వాపోయినప్పటికీ, మెజారిటీ ఓట్లతో ఆమె ఎలిమినేట్ అయ్యింది. వర్షిణి నామినేట్ చేసి మళ్లీ ఏడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలివారంలోనే చరణ్, చైత్రల వరుస ఎలిమినేషన్లతో బిగ్ బాస్ 10 హౌస్‌లో మునుపెన్నడూ లేనంత భయం, ఉత్కంఠ నెలకొన్నాయి.
Also Read:ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు..నటి ఫిర్యాదు!

