KTR:కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో

7
- Advertisement -

శాసనసభలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను మెడ పట్టి బయటకు గెంటేసి, తమ భాగోతాలు బయటపడకుండా చూసుకుంటున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో హారతి కర్పూరంలా భూములను ముఖ్యమంత్రి కాజేస్తున్నారని, మూసి సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ పేర్లతో వేల ఎకరాల విలువైన భూములను తమ అనుచరులకు, సీఎం సోదరులకు కట్టబెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

2014 కంటే ముందు రాష్ట్రంలో భూములు కొనాలంటే ప్రజల్లో అనేక మానసిక అనుమానాలు ఉండేవని కేటీఆర్ గుర్తుచేశారు. “కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులకు నీటిని అందించి, వ్యవసాయాన్ని పండుగ చేశారు. దీంతో రూ. 5 లక్షలు ఉన్న ఎకరం భూమి ధర రూ. 50 లక్షలకు పెరిగింది. భూమిని నమ్ముకున్న ఏ ఒక్కరూ చెడిపోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో గజానికి ఒక గజ దొంగ తయారయ్యారు” అని ఆయన మండిపడ్డారు.

బిఆర్ఎస్ పాలనలో కేవలం 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత (Prohibited) జాబితాలో ఉండేవి అని, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని కోటి 16 లక్షల ఎకరాలకు పెంచిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి బ్రదర్స్ ‘తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు’ అన్నట్లు భూములను కొల్లగొడుతున్నారు. మంత్రుల ముఠా ‘అలీ బాబా అరడజన్ దొంగల్లా’ తయారైందని, వాటాల వివాదాల కారణంగానే ఒక మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేశారని వ్యాఖ్యానించారు.

వీరప్పన్ అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో ఒక బ్లాక్ మెయిలర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పరిపాలన అలాగే ఉందంటూ ఘాటుగా విమర్శించారు.అత్తసొమ్ము అల్లుడికి దానం చేసినట్లు నగరం నడిబొడ్డున ఉన్న పారిశ్రామిక భూములను విక్రయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.రూ. 200 కోట్ల విలువ చేసే భూములను కేవలం రూ. 7 కోట్లకే సీఎం అనుచరులకు ఇచ్చారని చెప్పారు.సొంత అల్లుడి కోసం గిరిజనులకు చెందిన భూములను లాక్కునే కుట్ర చేశారన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని సముద్రలింగాపురం ఊర్లో 800 ఎకరాలను బలవంతంగా నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. కొంగరకలాన్ భూములు: కేసీఆర్ హయాంలో కలెక్టరేట్ నిర్మాణం జరిగాక అక్కడ ఎకరం ధర రూ. 15 కోట్లకు పెరిగిందని, ఇప్పుడు అక్కడ రూ. 100 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని ఎత్తిచూపారు.

రాష్ట్రంలో బిల్డర్లను బెదిరించి కమిషన్లు వసూలు చేస్తున్నారని, ప్రజలకు మానసిక ప్రశాంతత లేకుండా చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో, భూ కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాలపై సదరు అంతర్జాతీయ కంపెనీలకు స్వయంగా లేఖ రాస్తానని స్పష్టం చేశారు. అలాగే కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిన వైనంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామన్నారు.మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, నిషేధిత జాబితాలో పెట్టిన ప్రజల భూములను కాపాడుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Also Read:అసెంబ్లీ ఘటనపై ఢిల్లీకి బీఆర్‌ఎస్ బృందం

- Advertisement -