తండ్రి ఆస్తిపై కుమార్తెకు పూర్తి హక్కు!

3
- Advertisement -

భర్త మరణించిన తర్వాత భార్య (తల్లి) రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఆమె మొదటి భర్త ఆస్తిలో వారి కుమార్తెకు ఉన్న వారసత్వ హక్కులు ఏమాత్రం కోల్పోరని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహమైన లేదా వితంతువైన తల్లి మరో వివాహం చేసుకోవడం వల్ల ఆమెకు మాత్రమే మాజీ భర్త ఆస్తిపై హక్కు రద్దవుతుందని, కానీ ఆమె సంతానమైన కుమార్తె లేదా ఇతర ప్రాథమిక వారసుల హక్కులపై దాని ప్రభావం ఉండదని న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.

ఈ కేసులో మరణించిన వ్యక్తి ఆస్తికి సంబంధించి, అతని వితంతు భార్య మరో వివాహం చేసుకుంది. దీంతో, మరణించిన వ్యక్తి యొక్క ఉమ్మడి కుటుంబ (హెచ్‌యుఎఫ్) ఆస్తి వాటా తిరిగి కుటుంబంలోని ఇతర పురుష సభ్యులకే చెందుతుందని, ఆ వ్యక్తి కుమార్తెకు అందులో ఎలాంటి హక్కు ఉండదని బంధువులు కోర్టును ఆశ్రయించారు. 2005కు ముందు నాటి హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 24ను ఆధారంగా చేసుకుని వారు ఈ వాదనను లేవనెత్తారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ పి.బి. బాలాజీ ధర్మాసనం, పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. నిషేధం తల్లికి మాత్రమే, కుమార్తెకు కాదు: 2005 సవరణకు ముందు ఉన్న చట్ట ప్రకారం (సెక్షన్ 24), రెండో పెళ్లి చేసుకున్న వితంతువు మాత్రమే భర్త ఆస్తిపై హక్కు కోల్పోతుంది. కానీ, మరణించిన వ్యక్తి యొక్క ఇతర ప్రథమ శ్రేణి వారసులైన పిల్లల హక్కులు రద్దు కావు.

Also Read:రణ్‌వీర్-దీపికా..స్పెషల్ షూట్

భార్య పునర్వివాహం చేసుకున్నంత మాత్రాన మరణించిన భర్త వాటా తిరిగి ఇతర కుటుంబ సభ్యుల (కోపార్సనర్ల) వద్దకు వెళ్లదని, అతని కుమార్తె ఆ వాటాను పూర్తిగా పొందుతుందని కోర్టు తేల్చిచెప్పింది. తండ్రి మరణించినప్పుడు ఆయన కుమార్తె ఒక్కతే ప్రధాన వారసురాలిగా ఉంటే, తండ్రికి రావాల్సిన మొత్తం ఆస్తి వాటా ఆమెకే చెందుతుంది. దానిపై మూడో వ్యక్తికి లేదా ఇతర బంధువులకు హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు వెలువరించిన ఈ తీర్పు, వితంతువుల పిల్లలకు వారి తండ్రి ఆస్తిలో లభించే న్యాయమైన వారసత్వ హక్కులను మరింత బలపరిచింది.

- Advertisement -