రేవంత్‌కు షాక్..రైతన్నల ఆక్రోశం

2
- Advertisement -

రాష్ట్రంలో విద్యుత్ కోతలు, సాగునీటి అభద్రతపై రైతాంగం నుంచి ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం రైతులు మెరుపు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ‘పంటలన్నీ ఎండిపోయే’ అంటూ పాటలు పాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ధర్నా స్థలి వద్ద రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉచితంగా, నిరంతరాయంగా 24 గంటల కరెంట్ ఇచ్చారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. అరకొరగా వచ్చే కరెంట్‌లో కూడా తీవ్ర ఉత్పాదన (లో-వోల్టేజ్) లోపాలు ఉండటంతో పొలాల వద్ద మోటర్లు, స్టార్టర్లు కాలిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు.

“గత బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇచ్చినప్పుడు, ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు?”,”మాకు రావలసిన కృష్ణా నీళ్లను ఏపీ సీఎం చంద్రబాబు తరలించుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?”,”నీళ్లు, సమయానికి నాణ్యమైన కరెంట్ లేక చేతికొచ్చిన పంటలన్నీ కళ్ల ముందే ఎండిపోతున్నాయి.”,”ప్రజలకు, రైతులకు నీళ్లు తెచ్చే చేతకాకపోతే పదవికి రాజీనామా చేయండి.. మా నీళ్లు మేమే తెచ్చుకుంటాం!” అని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, గ్రామానికి సమీపంలోనే ఈ స్థాయిలో నిరసన వ్యక్తమవ్వడం గమనార్హం. కేవలం 6 నుండి 8 గంటల కరెంట్‌తో పంటలను కాపాడుకోవడం సాధ్యం కాదని, ప్రభుత్వం వెంటనే స్పందించి రోజంతా నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఉచిత, నాణ్యమైన విద్యుత్ హామీ నెరవేరే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

Also Read:బిగ్ బాస్ హౌస్ గోడ దూకిన కంటెస్టెంట్!

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు రైతులతో చర్చలు జరిపి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి, సాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -