తమిళనాడు శాసనసభ సోమవారం సమావేశాల ప్రారంభంలోనే తీవ్ర గందరగోళానికి వేదికైంది. రాష్ట్రంలో వరుస హత్యలు, క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ డిఎంకె (DMK) సభ్యులు నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య సభను ఉద్దేశించి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థ “మంచివారికి స్నేహితుడిగా, చెడ్డవారికి శత్రువుగా ఉండాలి అని…చట్టం అందరికీ సమానమేనని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా నేరానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఈ సభలో నేను ఒక ముఖ్యమైన విషయాన్ని నమోదు చేయాలనుకుంటున్నాను. పోలీసు శాఖ మంచివారికి మిత్రుడిగా, చెడ్డవారికి శత్రువుగా ఉండాలి. చట్టం అందరికీ సమానమే. నేరానికి పాల్పడినవారు ఏ పార్టీవారైనా చర్యలు ఉంటాయి. ఇదే మా విధానం అని సీఎం విజయ్ పేర్కొన్నారు.
పోలీసులు అధికార కేంద్రంగా మారకూడదని, ప్రజా రక్షకులుగా మాత్రమే ఉండాలని విజయ్ పునరుద్ఘాటించారు. గత మూడు నెలలుగా నమోదైన నేరాలపై స్పందిస్తూ, ఇవి హఠాత్తుగా జరిగినవి కాదని, పాత కక్షలు, ప్రతీకార చర్యల కారణంగానే జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతికి స్వస్తి పలకడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపారు. కోయంబత్తూరులోని ఒక కళాశాల విద్యార్థి హత్యకు సంబంధించి ఇప్పటికే 36 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.
నేరం వెనుక అనేక కోణాలు ఉంటాయి. కానీ ప్రతిపక్షాలు ఈ పరిస్థితులను ప్రభుత్వంపై నిందలు వేయడానికే ఉపయోగిస్తాయి. యువతకు ఒక అన్నగా తమిళనాడులో డ్రగ్ సంస్కృతిని అంతం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను అన్నారు. అవినీతి పట్ల తమ ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పారు. అన్ని 37 జిల్లాల్లో యాంటీ డ్రగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, చెన్నైలో NDPS చట్టం కింద 330 కేసులు నమోదు చేసి, గత మూడు నెలల్లో 556 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
Also Read:BB10:ఈసారి కంటెస్టెంట్స్ వీరే
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను ముందే అరికట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను నిరోధించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా “సింగప్పెణ్ స్పెషల్ ఫోర్స్”ను రూపకల్పన చేసిందని వివరించారు.

