మూడు దేశాల పర్యటనలో భాగంగా లండన్ వచ్చిన ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్…భిన్నత్వంలో ఏకత్వాన్ని మరోసారి చాటిచెప్పారు. ప్రతీ ఒక్కరూ తాము పనిచేసే ప్రాంతానికి (కర్మభూమికి) కట్టుబడి ఉండాలని పునరుద్ఘాటించారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన యువతపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.
తాము పనిచేస్తున్న నేలకు ఎవరూ ద్రోహం చేయకూడదని, ప్రతీ ఒక్కరూ తమ ‘కర్మభూమి’ పట్ల నిబద్ధతతో ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఆదివారం మరోసారి స్పష్టం చేశారు. మనిషికి జన్మనిచ్చిన ‘జన్మభూమి’ విలువలను నేర్పిస్తే, ఆ వ్యక్తి నిబద్ధతతో పనిచేసే ప్రదేశమే ‘కర్మభూమి’ అవుతుందని ఆయన అన్నారు.
లండన్లో జరిగిన ‘సెలబ్రేషన్ ఆఫ్ వన్ నెస్’ (Celebration of Oneness) కార్యక్రమంలో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ చీఫ్, ‘హిందూ భావజాలం’ గురించి వివరించారు. వైవిధ్యం అనేది సహజమైనదని, దాన్ని ప్రతీ ఒక్కరూ “గౌరవించి, ఆమోదించాలని” పిలుపునిచ్చారు. ఈ వైవిధ్యాన్ని “అస్తిత్వంలో ఉన్న ఏకత్వపు రకరకాల అలంకారాలు”గా భావించి ముందుకు సాగాలని సూచించారు.
ఇక్కడ ఎలాంటి సంఘర్షణ లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే, బ్రిటీష్ హిందువులు బ్రిటన్ వైపే నిలబడతారనేది స్పష్టం అని భగవత్ అన్నారు. మినహాయింపులు ఉండవచ్చు కానీ హిందూత్వ విషయంలో ఈ స్పష్టత ఉంది. మీరు పనిచేసే కర్మభూమికే మీ ప్రాధాన్యత, నిబద్ధత ఉండాలి అన్నారు.
Also Read:దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్
మీ జన్మభూమి లేదా మీ మూలాలు ఉన్న ప్రదేశం, పుణ్యభూమి మీకు ఉన్నతమైన విలువలను అందిస్తాయి. ఆ విలువలతో మీరు నివసిస్తున్న కర్మభూమికి సేవ చేస్తూ ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు.

