2029 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా తమిళగ వెట్రి కజగం (TVK) అంగీకరించకపోతే, తాను మరియు తన సహచర మంత్రి పి. విశ్వనాథన్ రాష్ట్ర ప్రభుత్వం నుండి రాజీనామా చేస్తామని తమిళనాడు మంత్రి ఎస్. రాజేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని టీవీకేతో కూటమిని వీడటానికి కూడా కాంగ్రెస్ వెనుకాడదని స్పష్టం చేశారు.
కన్యాకుమారిలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు పర్యాటక అభివృద్ధి సంస్థ మంత్రి, కిళ్లియూర్ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.తదుపరి సార్వత్రిక ఎన్నికలకు విజయ్ను ప్రధాని అభ్యర్థిగా పలువురు టీవీకే ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రొజెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని మంత్రి వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.
2029 లోక్‌సభ ఎన్నికల తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని అవుతారు. ఒకవేళ ఆయనను ప్రధాని అభ్యర్థిగా అంగీకరించేందుకు టీవీకే నిరాకరిస్తే, మా ఇద్దరు మంత్రులం కేబినెట్ నుండి వైదొలుగుతాం. మా పార్టీ అభిమతమే మాకు అత్యంత ప్రాధాన్యమైనదని స్పష్టం చేయాలనుకుంటున్నాం అని రాజేష్ చెప్పారు.
Also Read:ఆయిల్‌ఫెడ్ భూమిపై రేవంత్ కన్ను..హరీష్ ఫైర్
గతంలో డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, 2026 శాసనసభ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత ఆ పార్టీతో జతకట్టింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకోగా, టీవీకే 108 స్థానాలు సాధించింది. మరోవైపు డిఎంకే 59 స్థానాలకే పరిమితమైంది.

