ఆయిల్‌ఫెడ్ భూమిపై రేవంత్ కన్ను..హరీష్‌ ఫైర్

1
- Advertisement -

హైదరాబాద్‌లోని అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో, ఆర్టీసీ బస్ భవన్ ఎదురుగా ఉన్న ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ప్లాట్ నం.1లో గల 3.5 ఎకరాలకు పైగా (15,984 చదరపు గజాలు) ఆయిల్‌ఫెడ్ భూమిని తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆయన మండిపడ్డారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. బహిరంగ మార్కెట్‌లో గజం రూ. 2 లక్షల వరకు ధర పలుకుతుందని, మొత్తం 3.5 ఎకరాల భూమి విలువ రూ. 500 కోట్లకు పైగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. అయితే, పరిశ్రమల శాఖ తీసుకున్న ఒక నిర్ణయంతో అంతటి విలువైన భూమిని కేవలం రూ. 87 కోట్లకే (గజం రూ. 56 వేల చొప్పున) ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల భారీ నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఈ స్థలానికి సంబంధించిన రూ. 87 కోట్లను చెల్లించి, ఫ్రీహోల్డ్ హక్కులను పొందేందుకు సిద్ధంగా ఉండి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో నిధులు సమకూర్చుకున్నప్పటికీ, ప్రభుత్వం దానిని నిరాకరించి ప్రైవేట్ వ్యక్తికి అప్పగించేందుకు సిద్ధపడటం వెనుక అంతర్యం ఏమిటని హరీశ్ రావు ప్రశ్నించారు. 15,984 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ ఆస్తి దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయిల్‌ఫెడ్ ఆధీనంలోనే ఉండి రక్షణలో ఉందన్నారు. 1991లో జీవో 93 ద్వారా ఈ స్థలాన్ని ఆయిల్‌ఫెడ్‌కు కేటాయించారని గుర్తుచేశారు. న్యాయస్థానాల తీర్పులు, ప్రభుత్వ రికార్డులు స్పష్టంగా ఉన్నప్పటికీ ఆయిల్‌ఫెడ్‌కు కేవలం 1,800 చదరపు గజాలు మాత్రమే పరిమితం చేసి, మిగిలిన 14,000 చదరపు గజాలకు పైగా స్థలాన్ని ప్రైవేటు పరం చేయడం వెనుక రహస్యం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆయిల్‌ఫెడ్ సంస్థకు సంబంధించిన భూమిపై పరిశ్రమల శాఖ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం, ఈ విషయం సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా తెలియకపోవడం గమనార్హమని హరీశ్ రావు ఆరోపించారు. ఒకవైపు సాధారణ ప్రజల ఆస్తులను 22A నిరోధిత జాబితాలో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తూ మరోవైపు రూ. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఉపసంహరించుకోకుంటే తీవ్రస్థాయి పోరాటంఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న ఈ భూమి బదిలీ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, మొత్తం భూమిపై ఆయిల్‌ఫెడ్‌కే పూర్తి ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బిఆర్ఎస్ పక్షాన తీవ్ర స్థాయిలో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డిని లేఖ ద్వారా హెచ్చరించారు.

- Advertisement -