జలప్రళయం..ఆ రాష్ట్రాలకు అలర్ట్!

2
- Advertisement -

నేపాల్‌లో సంభవించిన భయాన్క వినాశకర వరదల కారణంగా భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. నదీ పరివాహక, సున్నిత సరిహద్దు ప్రాంతాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో బీహార్‌లోని 9 జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌లోని 7 జిల్లాలను హై అలర్ట్‌లో ఉంచారు.

నేపాల్‌లో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు కనీసం 163 మంది మరణించగా, 750 మందికి పైగా గల్లంతయ్యారు. నేపాల్ నుంచి వచ్చే నదుల్లో నీటిమట్టాలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో పొరుగు రాష్ట్రాలలో అప్రమత్తతను పెంచారు.బీహార్‌లోని పశ్చిమ చంపారన్ వద్ద గండక్ నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో గండక్ బ్యారేజీకి చెందిన 36 గేట్లను ఎత్తివేశారు. నదీతీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తు జాగ్రత్తగా ఖాళీ చేయిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు జిల్లా చంపావత్‌లో శారదా నది ఉధృతిపై అధికారులు నిఘా తీవ్రతరం చేశారు. అక్కడ ఎస్‌డిఆర్‌ఎఫ్ (SDRF) తనక్‌పూర్ పోస్ట్‌ను హై అలర్ట్‌లో ఉంచారు.

పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయిలో సమీక్ష జరిపారు. అమిత్ షా బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లతో మాట్లాడి నదుల నీటిమట్టాల పెరుగుదల మరియు రాష్ట్రాల సన్నాహక చర్యలపై చర్చించారు. నేపాల్‌లో సంభవించిన వినాశనాన్ని తీవ్రమైన హృదయవిదారక సంఘటనగా అభివర్ణించిన ఆయన, రెండు రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

నేపాల్ నుంచి ప్రవహించే నదుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉండటంతో బీహార్ సీఎం సమ్రాట్ చౌదరి అత్యవసర సమావేశం నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు.పశ్చిమ చంపారన్ ,తూర్పు చంపారన్,గోపాల్‌గంజ్,ముజఫర్‌పూర్,సివాన్,సరన్,శివహర్,సీతామర్హి,వైశాలి అలెర్ట్ జారీ చేశారు. గండక్ నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో పశ్చిమ చంపారన్ జిల్లాలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో బ్యారేజీ గేట్లు ఎత్తి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నేపాల్ నుంచి ప్రవహించే నదుల ప్రభావం పడే అవకాశం ఉన్న 7 జిల్లాల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్‌ను పెంచింది. మహరాజ్‌గంజ్,కుశీనగర్,పిలిభిత్, శ్రావస్తి, బలరాంపూర్, సిద్ధార్థనగర్, గోరఖ్‌పూర్ జిల్లాల్లో అలెర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా మహరాజ్‌గంజ్, కుశీనగర్ అధికారులను గండక్, నారాయణి నదుల నీటిమట్టాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అధికారిక సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:బీజేపీపై విరుచుకుపడ్డ అఖిలేష్

నేపాల్‌లోని నదీ వ్యవస్థలు భారతీయ రాష్ట్రాలతో అనుసంధానమై ఉండటమే ప్రధాన కారణం. నేపాల్‌లోని భోటేకోషి నది త్రిశూలి నదీ వ్యవస్థతో కలిసి ఉంటుంది. దేవఘాట్ సమీపంలో త్రిశూలి నది కాళీ గండకితో కలిసి ‘నారాయణి’ నదిగా మారుతుంది. ఇది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత ‘గండక్’ నదిగా పిలువబడుతుంది.అందువల్ల నేపాల్ ఎగువ ప్రాంతాలలో ఒక్కసారిగా నీరు పెరిగితే, అది దిగువన ఉన్న భారత్‌లోని గండక్ నదీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

- Advertisement -