పొంగులేటిని బర్తరఫ్ చేయాలి

2
- Advertisement -

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ఎం.జే. గార్డెన్స్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో 22A నిషేధిత భూముల బాధిత కుటుంబాలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా బాధితుల ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకొని బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

98 శాతం భూములను 22ఏ జాబితా నుంచి తొలగించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అదే నిజమైతే వందలాది మంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి ఇక్కడికి ఎందుకు వస్తారు?, 22ఏ జాబితాలో పెట్టడం ప్రభుత్వం చేసిన తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి దరఖాస్తుల పేరుతో కార్యాలయాల చుట్టూ సామాన్య ప్రజలు ఎందుకు తిరగాలి? లక్షలాది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టి వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసి ప్రజలను శిక్షిస్తారా?.. 58 ఏళ్ల క్రితం ఏర్పడిన పద్మారావు నగర్ ఫేజ్-1, 1950ల నాటి స్ప్రింగ్ ఫీల్డ్, నిజాంపేట్ లాంటి కాలనీల్లోని దశాబ్దాల క్రితం నాటి పట్టా భూములను కూడా 22ఏలో చేర్చడం తుగ్లక్ చర్య కాక మరేమిటి చెప్పాలన్నారు.

ప్రభుత్వంలో పని కావాలంటే లంచాలు చెల్లించాల్సిందే అన్నట్లుగా ముఖ్యమంత్రి, పొంగులేటి ఏజెంట్లు వసూళ్లకు దిగారు. మహబూబ్ నగర్‌కు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో విల్లాకు, ఫ్లాట్‌కు 30 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే పని అవుతుందని బాధితులు బహిరంగంగానే వాపోతున్నారు. అమీన్‌పూర్ నుంచి వచ్చిన ఒక బాధితుడిని ఎంఆర్వో, ఆర్డీవో, కలెక్టర్ అంటూ చుట్టూ తిప్పించుకుని.. చివరకు బయట బ్రోకర్లను కలిస్తేనే పని అవుతుందని పరోక్షంగా బెదిరిస్తున్నారు. ఈ 22ఏ కుట్ర వెనుక భారీ కమీషన్ల బాగోతం దాగి ఉంది. దీనికి ఏ-1 రేవంత్ రెడ్డి, ఏ-2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 50-50 కమీషన్ల కోసమే ఈ దోపిడీ అంతా జరుగుతోంది. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తెలుసు అని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటారు. ఆ వ్యాపారం తెలిస్తే ప్రజల కష్టాలు తీర్చాలి కానీ, వాళ్ల రక్తం పీల్చి పిప్పి చేస్తారా? చెప్పాలన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూములున్నా హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, హౌసింగ్ బోర్డు భూములతో పాటు చివరికి పిల్లలు ఆడుకునే వెయ్యి గజాల పార్కును కూడా రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టారు. ఇలా అమ్ముకుంటూ పోతే రేపు గుడికో, బడికో.. చివరకు స్మశాన వాటికకు కూడా భూమి మిగలదు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే కంచే చేను మేసినట్లుగా తయారై ఆస్తులను లాక్కుని ఆగం చేస్తోంది. ఈ కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. ఆడపిల్లల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కరువైంది. ఈ సమస్య కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి ఎకరాల వ్యవసాయ భూములను కూడా 22ఏలో పెట్టారు. మల్కాజిగిరిలో 22ఏ భూములపై నేను మాట్లాడినప్పుడు, అక్కడికొచ్చిన వారి పేర్లు రాసుకుని వారి భూములను జాబితా నుంచి తొలగించారు. అలాగే తెలంగాణ భవన్‌కు వచ్చిన బాధితుల వివరాలు తీసుకుని జాబితా నుంచి తీసేశారు. అంటే బీఆర్ఎస్ పోరాటం వల్లే ప్రభుత్వంలో ఈ మాత్రం కదలిక వస్తోంది.

Also Read:హిజాబ్‌పై హైకోర్టు కీలక తీర్పు

ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ప్రజల కష్టాలు ఎక్కడుంటే అక్కడ పార్టీ అండగా నిలబడుతుంది. సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. దద్దరిల్లేలా సభను స్తంభింపజేసి అయినా బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యేలా కొట్లాడుతాం. భూములను ఎవరు నిషేధిత జాబితాలో పెట్టమన్నారో విచారణ జరగాలి. తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. నిషేధిత జాబితాను సీక్రెట్‌గా ఎందుకు ఉంచుతున్నారు.. వెబ్‌సైట్‌లో జాబితాను ఎందుకు బ్లాక్ చేశారు? ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజల భూములతో చెలగాటమాడుతూ వారిని నిద్ర లేకుండా చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి తక్షణమే బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు.

- Advertisement -