జర్నలిస్ట్ అభిషేక్‌కు సుప్రీంలో ఊరట

2
- Advertisement -

అయోధ్య రామజన్మభూమి ఆలయ విరాళాల దుర్వినియోగం మరియు నిధుల కుంభకోణంపై సంచలనాత్మక కథనాన్ని అందించిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్‌కు భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఘజియాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనకు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అభిషేక్ ఉపాధ్యాయ్‌పై ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో ఓ రోడ్ రేజ్ (రోడ్డుపై వివాదం) ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే, తన స్వతంత్ర జర్నలిస్టిక్ పనిని నిరోధించేందుకు, తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఆరోపణలతో ఈ ఎఫ్‌ఐఆర్‌ను కల్పిత కథనాలతో నమోదు చేశారని అభిషేక్ ఆరోపించారు.

అయోధ్య రామమందిరానికి చెందిన విరాళాల నిధుల దుర్వినియోగంపై కథనం ఇచ్చిన మొదటి జర్నలిస్టులలో అభిషేక్ ఒకరు. ఘజియాబాద్ పోలీసులు తన నివాసానికి వచ్చి వేధించారని, ఎఫ్‌ఐఆర్ ప్రతిని కూడా తనకు సరిగా ఇవ్వలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది.

యూపీ పోలీసులు తక్షణమే ఎఫ్‌ఐఆర్ కాపీని అభిషేక్ ఉపాధ్యాయ్‌కు అందించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అభిషేక్‌పై ఎలాంటి కఠినమైన లేదా అరెస్ట్ వంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసుకోవడం (Quashing) మరియు తదుపరి ఉపశమనాల (Reliefs) కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది.

Also Read;హిజాబ్‌పై హైకోర్టు కీలక తీర్పు

జర్నలిస్టుల స్వేచ్ఛను అడ్డుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఊరటనిచ్చాయి.

- Advertisement -