కేంద్ర ప్రభుత్వం జులై 25న ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) 2026 సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో ‘శాంతియుత’ నిరసన మార్చ్‌కు పిలుపునిచ్చింది. జులై 25న ప్రభుత్వం ఇచ్చిన హామీల ఆధారంగా దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనలను ఉపసంహరించుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ..దేశ యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందనే అంశంపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన CJP జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించారు.
తన జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం CJP ఒక ప్రకటన విడుదల చేస్తూ, సెప్టెంబర్ 5న జరిగే శాంతియుత మార్చ్ ఇండియా గేట్ వద్ద ప్రారంభమై న్యూఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వైపు సాగుతుందని తెలిపింది. ఈ ర్యాలీకి మరణించిన NEET బాధితుల కుటుంబాలు మరియు జులై 20న జరిగిన ‘సంసద్ చలో’ మార్చ్ సమయంలో పోలీసుల దాడికి గురైన బాధితుల కుటుంబాలు నాయకత్వం వహిస్తాయని పేర్కొంది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువజన సంఘాలు, యువ పౌరులు మద్దతుగా తరలివస్తారని వెల్లడించింది.
ప్రభుత్వం Gen-Z (నేటి యువత) కు మరియు తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు ‘విశ్వాసఘాతుకం’ చేయడానికి సిద్ధపడినందున, తాము మళ్లీ వీధుల్లోకి రాక తప్పడం లేదని CJP ఆరోపించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి బదులుగా సాంకేతిక కారణాలను చూపుతూ కాలయాపన చేస్తోందని, స్పష్టమైన హామీలు ఇవ్వకుండా తప్పించుకుంటోందని CJP తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. “గత నెల రోజులుగా వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి బదులుగా ప్రభుత్వం ఆలస్యపు నాటకాలాడుతోంది, సాంకేతిక అంశాల వెనుక దాక్కుంటోంది, మరియు చివరికి భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ముందు కూడా స్పష్టమైన హామీ ఇవ్వకుండా నిరాకరిస్తోంది” అని కమిటీ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్ల జాబితాను అందిస్తే, వాటన్నింటినీ ఒకేసారి కొట్టివేసేలా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు కోరినప్పటికీ, ఆ వివరాలను అందించడానికి కూడా ప్రభుత్వం నిరాకరించిందని ఆరోపించింది.ఆగస్టు 18న, దేశవ్యాప్తంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల జాబితాను ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని పలుమార్లు కోరింది. కానీ ప్రభుత్వం అందుకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. CJPకి ప్రభుత్వం ఇవ్వాల్సిన రాతపూర్వక హామీ కూడా ఇంకా బాకీ ఉంది అని తెలిపింది.
Also Read:కర్ణాటకలో H1N1 విజృంభణ
ఇదిలాగే కొనసాగకూడదు. మా ఓర్పును బలహీనతగా భావించవద్దు…మా మంచి తనాన్ని ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసే అవకాశంగా వాడుకోకూడదు అని CJP తమ ప్రకటనలో పేర్కొంది.

