యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దీనిని దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక కీలక మలుపుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ UPI అనుభవాలను పంచుకోవాలని ప్రధాని కోరారు.
ఎక్స్‌లో పోస్టు చేసిన మోదీ.. పదేళ్ల క్రితం ప్రారంభమైన UPI, భారత డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. UPI సాధించిన విస్తృతి మరియు స్థాయిని చూసి ప్రతి భారతీయుడూ గర్వపడాలి. UPIతో మీకున్న అనుభవం ఏమిటో, అది మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందో నాతో పంచుకోండి అని పేర్కొన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పర్యవేక్షణలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా 2016 ఆగస్టు 25న UPI సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి.అంతకుముందు ఏప్రిల్ 2016లో 21 భాగస్వామ్య బ్యాంకులతో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. డిసెంబర్ 2016లో BHIM యాప్‌ను ప్రవేశపెట్టారు.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.78 కోట్లుగా ఉన్న వార్షిక లావాదేవీల సంఖ్య 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా పెరిగి దాదాపు 13,000 రెట్ల వృద్ధిని నమోదు చేసింది.
అలాగే లావాదేవీల విలువ కూడా రూ. 0.07 లక్షల కోట్ల నుండి రూ. 314 లక్షల కోట్లకు చేరి 4,000 రెట్లకు పైగా పెరిగింది.ప్రస్తుతం గ్రీస్, మాల్దీవులు సహా ప్రపంచవ్యాప్తంగా 11 దేశాలలో UPI సేవలు ఆమోదించబడుతున్నాయి.
Also Read:కర్ణాటకలో H1N1 విజృంభణ

