పదే పదే ‘ఎక్స్‌’ గురించి ఆలోచిస్తున్నారా?

2
- Advertisement -

“ఒక్క నిమిషం చూసి పెట్టేద్దాం” అనుకుని మీ ఎక్స్ (మాజీ భాగస్వామి) సోషల్ మీడియా ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు. కొత్త ఫోటో చూడడం దానికి ఎవరు లైక్ చేశారో గమనించడం, ఫాలోవర్లను చెక్ చేయడం.. చివరకు మూడు నెలల కిందటి పోస్ట్ దగ్గర ఆగడం ఇలా చాలామందికి తెలియకుండానే ఇదొక అలవాటుగా మారిపోతుంది.

వారు మిమ్మల్ని ఇంకా గుర్తుతెచ్చుకుంటున్నారేమో అనే సంకేతం కోసమో, వారు ముందుకు సాగిపోయారా అని తెలుసుకోవడానికో, లేదా వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆరాటంతోనో ఇలా చూస్తుంటారు. అయితే ప్రతిసారి మీరు వారి ప్రొఫైల్ చూసినప్పుడు దొరికే కొద్దిపాటి సమాచారం, మళ్లీ మళ్లీ చూడాలనే కోరికను పెంచుతుంది.

ఈ అలవాటు నుంచి బయటపడటానికి కేవలం సంకల్ప బలం మీద మాత్రమే ఆధారపడకండి. మీ రీసెంట్ సెర్చ్‌లలో వారి ప్రొఫైల్ కనిపిస్తుంటే ముందుగా దాన్ని తీసేయండి.వారి పోస్టులు, స్టోరీలను మ్యూట్ చేయండి.అవసరమైతే అన్‌ఫాలో చేయండి లేదా కొద్దిరోజులు ఆ సోషల్ మీడియా యాప్‌నే ఫోన్ నుంచి తొలగించండి.

పెద్దగా ప్రచారం చేసి బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. వారి ప్రొఫైల్ ఓపెన్ చేసే ముందు ఒక క్షణం ఆగి, అక్కడ ఏం చూడాలని ఆశిస్తున్నారో ఆలోచించండి.వారు మీ గురించి ఏమైనా పోస్ట్ చేశారా అని చూస్తున్నారా?,వేరే ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా అని చెక్ చేస్తున్నారా?,మీరు లేకపోవడం వల్ల వారు బాధపడుతున్నారనే నిరూపణ కోసమా?

మీ ఆలోచన పట్ల మీరు నిజాయితీగా ఉండడం ముఖ్యం. ఎందుకంటే ఇది సోషల్ మీడియా గురించి కాదు, మానసిక ఓదార్పు కోసం పడే ఆరాటం. కానీ వారి ప్రొఫైల్ మీకు కావాల్సిన సమాధానం ఇవ్వలేదు. ఒక్క ఫోటో వారి నిజమైన భావాలను చెప్పలేదు, ఒక సంతోషకరమైన పోస్ట్ వారి అసలు జీవితాన్ని ప్రతిబింబించలేదు.

చాలామంది పడే అతిపెద్ద పొరపాటు — ఎక్స్ ప్రొఫైల్ ఆధారంగా తమ బాధను పోల్చి చూసుకోవడం. మీ ఎక్స్ ప్రయాణాలు చేస్తూ, తిరుగుతూ సంతోషంగా ఉన్నట్లు కనిపించవచ్చు. మీరు మాత్రం ఇంకా బాధపడుతూ ఉండవచ్చు. దీనివల్ల మీరు ఇంకా వెనుకబడి ఉన్నారేమో అనిపించవచ్చు.కానీ సోషల్ మీడియా అనేది ఎంచుకుని పెట్టిన కొన్ని సంతోష క్షణాల సమాహారం మాత్రమే, అది వారి నిజమైన మానసిక స్థితి కాదు. మీరు ఇంకా వారిని గుర్తుతెచ్చుకుంటున్నంత మాత్రాన మీ రికవరీ నెమ్మదిగా ఉన్నట్లు కాదు. మీరు ముందుకు సాగారని నిరూపించుకోవడానికి పూర్తిగా నిర్లిప్తంగా మారాల్సిన అవసరం లేదు.

Also Read:ట్రంప్‌తో వాణిజ్య చర్చలు రద్దు!

- Advertisement -