యాపిల్‌లో మరోసారి లేఆఫ్స్‌!

2
- Advertisement -

గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన సంస్థలో ఉద్యోగుల తొలగింపులను చేపట్టినట్లు ధ్రువీకరించింది. బిజినెస్ రీస్ట్రక్చరింగ్‌లో (పునర్వ్యవస్థీకరణ) భాగంగా వివిధ విభాగాలకు చెందిన కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు యాపిల్ తెలిపింది. డిజిటల్ సర్వీసెస్, కార్పొరేట్ టీమ్‌లతో పాటు అనేక ఇతర కీలక విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ఈ ప్రభావం పడినట్లు సమాచారం.

ఈ ప్రక్రియపై యాపిల్ సంస్థ అధికారికంగా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. “మా వ్యాపార వ్యూహాలకు అనుగుణంగా వనరులను తిరిగి సమర్థవంతంగా కేటాయించే క్రమంలో భాగంగా కొన్ని విభాగాల్లో మార్పులు చేపడుతున్నాం. ఈ మార్పుల ద్వారా భవిష్యత్తులో కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తు కొంతమంది ఉద్యోగులను తొలగించక తప్పడం లేదు” అని కంపెనీ వివరించింది. ప్రభావితమైన ఉద్యోగులకు తగిన పరిహారం అందించడంతో పాటు ఇతర అంతర్గత విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు పేర్కొంది.

యాపిల్ సాధారణంగా ఇతర టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలతో పోలిస్తే భారీస్థాయి లేఆఫ్స్‌కు దూరంగా ఉంటుంది. కానీ, మారుతున్న సాంకేతిక విపణి సవాళ్లు, ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై మరింత శ్రద్ధ పెట్టడం మరియు ప్రాజెక్టుల ప్రాధాన్యతల్లో మార్పుల కారణంగా యాపిల్ సైతం ఈ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలోని ఏయే విభాగాల నుండి ఎంతమంది ఉద్యోగులను తీసివేశారనే ఖచ్చితమైన సంఖ్యను యాపిల్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Also Read:హార్ముజ్‌..అమెరికా భూభాగమే!

- Advertisement -