కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) మరియు మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కార్యాచరణపై చర్చించేందుకే ఈ సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ‘సౌత్ జోన్ కౌన్సిల్’ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో డీలిమిటేషన్ అంశంపై చర్చించారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాల విభజన చేపడితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆందోళనను పలు రాష్ట్రాలు హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాయి.
డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగి, దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుందని తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 వద్దే నిలిపివేయాలని (ఫ్రీజ్ చేయాలని) డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (TVK) డీలిమిటేషన్‌కు అంగీకరించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్గాలు ఖండించాయి. జనాభా నియంత్రించినందుకు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య శాతం తగ్గకుండా కేంద్రం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని సీఎంగా విజయ్ కోరారు.
పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ వాటా, ప్రాతినిధ్య శాతానికి ఎలాంటి భంగం వాటిల్లకుంటే డీలిమిటేషన్ ప్రక్రియకు మద్దతిచ్చేందుకు వైసీపీ, టీవీకే, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు డీలిమిటేషన్‌పై కేంద్రం ఏ విధమైన తుది నిర్ణయం తీసుకుంటుందోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Also Read:అనీష్..‘ఇట్లు అర్జున’

