సనత్‌నగర్ టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సందర్శన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ అగ్రనేతలు, మాజీ మంత్రులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
ఆసుపత్రి సందర్శనకు పిలుపునిచ్చిన మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌లతో పాటు పలువురు నాయకులను పోలీసులు బుధవారం ఉదయం ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలో భారీగా పోలీసు మోహరింపు మాజీ మంత్రి హరీశ్ రావు ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావును పరామర్శించేందుకు వచ్చిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితర నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు.
సనత్‌నగర్ TIMS ఆసుపత్రిని కట్టింది మేమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ హయాంలోనే 90% పైగా పనులు పూర్తయిన ఆసుపత్రిని, మౌలిక సదుపాయాలు సరిగ్గా కల్పించకుండానే హడావుడిగా ప్రారంభించారు అని మండిపడ్డారు హరీష్ రావు. అక్కడి డొల్లతనం, సదుపాయాల లేమి బయటపడుతుందనే భయంతోనే మమ్మల్ని చట్టవిరుద్ధంగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆసుపత్రిని కట్టింది రేవంత్ రెడ్డే అయితే మమ్మల్ని ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?….పోలీసుల బలప్రయోగంతో తమను అడ్డుకోలేరని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.
Also Read:ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం..సుప్రీం నో!

