Fake SIR స్కాం..జాగ్రత్త!

1
- Advertisement -

ఎలక్షన్ కమిషన్ అధికారిగా నటిస్తూ ఒక సైబర్ నేరగాడు పంపిన నకిలీ APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ముంబైకి చెందిన ఒక రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ రూ. 17 లక్షల రూపాయిలు పొగొట్టుకున్నారు. సైబర్ నేరగాడు ఎన్నికల సంఘం అధికారిగా నటిస్తూ బాధితుడి చేత హానికరమైన APK యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాడు.

తర్వాత ఐదు విడతల్లో ఖాతాలోని డబ్బులు ఊడ్చేయడంతో బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించగా వారు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.ఓటర్ల వివరాలను సరిచూసుకోవడానికి మరియు ఓటర్ల జాబితాను నవీకరించడానికి (అప్‌డేట్ చేయడానికి) భారత ఎన్నికల సంఘం ప్రస్తుతం ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను చేపడుతోంది. అయితే, ఈ SIR ప్రక్రియను సాకుగా చూపి ముంబైకి చెందిన ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్‌ను బురిడీ కొట్టించి రూ.17 లక్షలు దోచుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ముంబైలోని డియోనార్‌కు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపాల్‌కు ఒక వ్యక్తి ఫోన్ చేసి, తాను ఎలక్షన్ కమిషన్‌కు చెందిన చంద్రశేఖర్‌ను అని పరిచయం చేసుకున్నాడు. ఓటర్ల జాబితాలో బాధితుడి తండ్రి పేరు తప్పుగా నమోదు అయిందని, ఆగస్టు 8 గడువులోగా SIR ఫారాన్ని పూర్తి చేయాలని నమ్మబలికాడు.ఒకవేళ ఈ ఫారాన్ని నింపకపోతే రాబోయే ఎన్నికల్లో ఓటు వేయడానికి వీలుండదని భయపెట్టాడు. అనంతరం ఓటర్ అప్‌డేట్ కోసం ఒక ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు కింద కేవలం రూ. 5 చెల్లించాలని కోరాడు.

బాధితుడు ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసిన వెంటనే సైబర్ నేరగాడు అతడి మొబైల్ ఫోన్‌ యాక్సెస్ తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆగస్టు 8న తన ఖాతా నుండి ఐదు అనధికారిక ట్రాన్సాక్షన్ల ద్వారా నిధులు మళ్లినట్లు బాధితుడికి మెసేజ్‌లు వచ్చాయి. ఒక ప్రైవేట్ బ్యాంక్ మరియు రెండు జాతీయ బ్యాంకుల్లోని ఖాతాలకు ఈ విధంగా మొత్తం రూ. 17 లక్షలు అక్రమంగా బదిలీ అయ్యాయి.

Also Read:రామమందిర విరాళాల చోరీ..తుది నివేదిక

ఆ తర్వాత బాధితుడు తన ఫోన్‌లో Online Voter Verification మరియు Device Protection అనే రెండు కొత్త అప్లికేషన్‌లు ఉండటాన్ని గమనించి తాను మోసపోయానని గ్రహించాడు. ఇంతలో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుండి సంతోష్ గుప్తా అని చెప్పుకుంటూ మరొక వ్యక్తి ఫోన్ చేశాడు. బాధితుడు తన బ్యాంకింగ్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాడని తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే ఫోన్ కట్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఆగస్టు 10న ముగ్గురు అపరిచిత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై సైబర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

- Advertisement -