ఆహారం తిన్న తర్వాత పొట్టలో అసౌకర్యంగా ఉంటే చాలామంది దానిని సాధారణ గ్యాస్, ఎసిడిటీ లేదా అజీర్తి అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ప్రతిసారి జీర్ణవ్యవస్థలో కనిపించే ఈ మార్పులు కేవలం గ్యాస్ సమస్య మాత్రమే కాకపోవచ్చు, ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన గుండె జబ్బు కావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక కేసు ప్రకారం ఒక మహిళ గత రెండు సంవత్సరాలుగా రాత్రి భోజనం చేసిన ప్రతీసారి కడుపులో ఉబ్బరం, గుండెల్లో మంట, అసౌకర్యానికి గురయ్యేది. దానిని సాధారణ ఎసిడిటీగా భావించి రెండేళ్ల పాటు ప్రత్యామ్నాయంగా గ్యాస్ మాత్రలు వేసుకుంటూ కాలం గడిపింది. అయితే సమస్య ఏమాత్రం తగ్గకపోవడంతో చివరికి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా ఆమె ‘ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్’ అనే తీవ్రమైన గుండె రక్తనాళాల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు.
మనం ఆహారం తీసుకున్న తర్వాత శరీరం దానిని అరిగించడానికి జీర్ణవ్యవస్థ వైపు ఎక్కువ మొత్తంలో రక్తాన్ని పంపుతుంది. ఇప్పటికే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో పూడికలు ఉన్నవారికి, భోజనం తర్వాత జీర్ణక్రియ కోసం రక్తం మళ్లడంతో గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ మరియు రక్తం అందక ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఛాతీలో నిండుగా ఉన్నట్లు అనిపించడం, కడుపు పైభాగంలో పట్టేసినట్లు నొప్పి రావడం, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని సాధారణంగా జీర్ణకోశ సమస్యలుగా భావించి పొరబడతుంటారు.సాధారణ ఎసిడిటీకి, గుండె సమస్యకు కొన్ని స్పష్టమైన తేడాలు ఉంటాయి.
గ్యాస్ వల్ల వచ్చే మంట ఎసిడిటీ మాత్రలతో తగ్గుతుంది కానీ గుండె సంబంధిత నొప్పికీ ఈ మాత్రలు ఉపశమనం ఇవ్వవు. అలాగే గుండె సమస్య ఉన్నప్పుడు కడుపు పైభాగం లేదా ఛాతీలోని నొప్పి మెడ, దవడలు, వీపు లేదా ఎడమ చేతికి పాకే అవకాశం ఉంది. దీంతో పాటు చిన్నపాటి శ్రమకే విపరీతమైన ఆయాసం ఆ సమయంలో చల్లటి చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆహారం తిన్న తర్వాత లేదా కొద్దిగా నడిచినప్పుడు కడుపు పైభాగంలో పదేపదే అసౌకర్యం అనిపిస్తే గ్యాస్ అనుకుని స్వీయ వైద్యం చేసుకోకుండా వెంటనే ఈసీజీ (ECG) లేదా 2D ఎకో పరీక్షలు చేయించుకోవడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:రామమందిర విరాళాల చోరీ..తుది నివేదిక

