BJP:యూపీ ఇంఛార్జీగా వినోద్

1
- Advertisement -

త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం నాడు కొత్త రాష్ట్ర ఇన్ఛార్జులను నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని ప్రకటించిన మరుసటి రోజే ఈ నియామకాలు జరగడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ లో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ….ఆ రాష్ట్ర ఇంఛార్జీగా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వినోద్ తావ్డేకు అప్పగించారు. ఆయనకు సహాయంగా జాతీయ కార్యదర్శి జగదీష్ ఈశ్వర్‌భాయ్ పటేల్ కో-ఇన్ఛార్జ్ (సహ ఇన్ఛార్జ్)గా వ్యవహరిస్తారు.

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్‌లతో హోరాహోరీ పోటీ నెలకొన్న పంజాబ్ రాష్ట్ర ఇన్ఛార్జ్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సతీష్ పూనియాను నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల స్వరాష్ట్రమైన గుజరాత్ బాధ్యతలను బీజేపీ జాతీయ కార్యాలయ ఇన్ఛార్జ్‌గా ఉన్న రాజ్యసభ ఎంపీ తరుణ్ చుగ్‌కు అప్పగించారు. గుజరాత్‌లో 1995 నుండి బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.

నయా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్‌కు సహకరించేందుకు 13 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 16 మంది కార్యదర్శులతో కూడిన కొత్త బృందాన్ని పార్టీ ప్రకటించింది. ఇందులో చాలావరకు కొత్త ముఖాలకు చోటు కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే (ఉపాధ్యక్షురాలు), సునీల్ బన్సాల్, వినోద్ తావ్డే (ప్రధాన కార్యదర్శులు), అనిల్ బలూనీ (మీడియా హెడ్), సంబిత్ పాత్ర (ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్త) వంటి పలువురు సీనియర్లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

Also Read:రామమందిర విరాళాల చోరీ..తుది నివేదిక

ఈ క్రమంలోనే రాబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా పార్టీ ఈ ఇన్ఛార్జుల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.

- Advertisement -