మున్సిపల్ కమిషనర్..మానవత్వం

1
- Advertisement -
అధికారం, బాధ్యతలకు తోడు కాసింత మానవత్వం తోడైతే ఒక నిండు ప్రాణాన్ని కాపాడుకోవచ్చని నిరూపించారు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య. జన్మించిన 12 రోజులకే తీవ్రమైన గుండె సంబంధిత సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న ఓ చిన్నారికి కొండంత అండగా నిలిచి, శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందించి ఆ పసిపాపకు పునర్జన్మ ప్రసాదించారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో నరసమ్మ అనే మహిళ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె మనవరాలు, పుట్టిన 12 రోజుల పసిపాప తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతోంది. పాప ప్రాణాలు కాపాడుకోవడానికి అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) చేయించాలని, లేకపోతే పాప ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆపరేషన్‌కు రూ.14 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో పేద కుటుంబానికి చెందిన ఆ చిన్నారి తల్లిదండ్రులు, అమ్మమ్మ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ఈ క్రమంలో అమ్మమ్మ నరసమ్మ తన మనవరాలి పరిస్థితిని వివరిస్తూ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యను ఆశ్రయించింది. చిన్నారి పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన కమిషనర్ వెంటనే స్పందించారు. ఆలస్యం చేయకుండా ‘హృదయ’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేశారు. ముమ్మర ప్రయత్నాలు చేసి, చిన్నారి శస్త్రచికిత్సకు అవసరమైన రూ.14 లక్షల ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందేలా చర్యలు తీసుకున్నారు.
కమిషనర్ చొరవతో సమకూరిన ఆర్థిక సాయంతో వైద్యులు చిన్నారికి విజయవంతంగా గుండె శస్త్రచికిత్స పూర్తి చేశారు. ప్రస్తుతం పాప పూర్తి ఆరోగ్యంతో ఉంది. సకాలంలో స్పందించి తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన కమిషనర్ అభిషేక్ అగస్త్యకు చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ చేసిన ఈ మహోపకారానికి గుర్తుగా ఆయనపై ఉన్న అపారమైన గౌరవంతో ఆ దంపతులు తమ చిన్నారికి “జస్విక శ్రీ” అని నామకరణం చేశారు.
- Advertisement -