TTD:నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తం

1
- Advertisement -

తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.టీటీడీ పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీలు నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నారు. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి తదితర బుకింగ్‌లు ఇప్పిస్తామంటూ నమ్మించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీకి పలు ఫిర్యాదులు అందాయి.

ఈ నేపథ్యంలో భక్తులు టీటీడీకి సంబంధించిన దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లను అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది. వాట్సాప్, సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే అనధికారిక బుకింగ్ లింకులతో అప్రమత్తంగా ఉండాలి.

టీటీడీ పేరు, లోగో, చిత్రాలు, ట్రేడ్‌మార్క్‌లను ఉపయోగిస్తూ నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఐటీ, విజిలెన్స్, సైబర్ క్రైమ్ పోలీస్ తదితర విభాగాల సమన్వయం చేసుకుని ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. ఇటువంటి నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను గుర్తించి తొలగించడం, బ్లాక్ చేయించడం, దర్యాప్తు చేపట్టేలా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. గత రెండేళ్లలో 259 ఫేక్ వెబ్ సైట్లను గుర్తించి తొలగించడంతో పాటు ఆ వెబ్ సైట్ లకు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది.

టీటీడీ పేరు, లోగో, మేధో సంపత్తిని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై కాపీరైట్, ట్రేడ్‌మార్క్, సైబర్ చట్టాల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Also Read:Dharman:పవర్‌ఫుల్ డాక్టర్‌గా రజనీ

భక్తులు ఈ జాగ్రత్తలు పాటించాలి

* టీటీడీ సేవలు, దర్శనం, వసతి బుకింగ్‌లను అధికారిక టీటీడీ వెబ్‌సైట్/యాప్‌లో మాత్రమే చేసుకోవాలి.

* వాట్సాప్‌లో వచ్చే అనధికారిక బుకింగ్ సందేశాలు, లింకులను నమ్మకూడదు.

* టీటీడీ పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీలను చూసి మోసపోవద్దు.

* తెలియని వ్యక్తులకు బుకింగ్ పేరుతో డబ్బులు పంపవద్దు.

* టీటీడీ పేరు, లోగోను ఉపయోగిస్తున్న వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా ఖాతా అధికారికమైనదో కాదో నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలి.

- Advertisement -