తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య నడుస్తున్న వివాదంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. ఈ వివాదానికి సంబంధించి తాను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని కోరారు.
నిర్మాతలు డ్యాన్సర్ల కోసం కేటాయించే పారితోషికం, ఇతర అలవెన్సులు వారికి పూర్తిగా అందడం లేదనేది తన ముఖ్యమైన ఆవేదన అని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. డ్యాన్సర్ల సంక్షేమం కోసమే నేను మాట్లాడాను. నిర్మాతలు ఇచ్చే డబ్బులు కింది స్థాయి కళాకారులకు సరిగ్గా చేరుతున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని ఆయన పేర్కొన్నారు.
ఈ సమస్యపై మెగాస్టార్ చిరంజీవితో కూడా చర్చించినట్లు జానీ మాస్టర్ వెల్లడించారు. చిరంజీవికి సమస్యను వివరించినప్పుడు ఆయన చాలా సహానభూతితో విన్నారు. పరిశ్రమలోని వర్గాలన్నీ సామరస్యపూర్వక వాతావరణంలో చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు అని తెలిపారు.
ఫెడరేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్లతో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ…పిల్లలు తప్పు చేస్తే తండ్రి కోప్పడతాడు కానీ చివరకు మళ్లీ దగ్గరకు తీసుకుంటాడు. అలాగే డ్యాన్సర్స్ అసోసియేషన్ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని కళాకారులను ప్రోత్సహించాలి అని ఆకాంక్షించారు. తెలిసి తెలియక జరిగిన తప్పిదాలను మనసులో ఉంచుకోకుండా, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని, సినీ కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read:మ్యారేజ్ డే..మొక్కలు నాటిన సంతోష్ దంపతులు

