యుఎస్-ఇజ్రాయెల్ దాడుల వల్ల జరిగిన నష్టానికి $300 బిలియన్ల నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ చేసిన డిమాండ్‌ను డోనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దానికి బదులుగా ఇరాన్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు ఇరానే అమెరికాకు పరిహారం చెల్లించాలని డోనాల్డ్ ట్రంప్ ప్రత్యుత్తరం ఇచ్చారు.
అత్యంత కీలకమైన వాణిజ్య జలమార్గం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (Strait of Hormuz)ను పూర్తిగా తెరవడానికి ఈ డిమాండ్లను షరతులుగా ఇరాన్ విధించింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన 5 నెలల సైనిక ఘర్షణల వల్ల ఈ నష్టం జరిగిందని ఇరాన్ పేర్కొంది. తమ డిమాండ్లను అమెరికా అంగీకరించే వరకు హోర్ముజ్ జలసంధి ‘యుద్ధ క్షేత్రం’గానే ఉంటుందని ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్పష్టం చేసింది.
ఇరాన్ డిమాండ్‌పై తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందించిన ట్రంప్…ఇదొక “ఆసక్తికరమైన ఆలోచన” అని ఎద్దేవా చేశారు. భవిష్యత్ చర్చలలో తాను కూడా కౌంటర్ డిమాండ్లు పెడతానని స్పష్టం చేశారు.: ఇరాన్ కుట్రలు, దాడుల వల్ల మరణించిన లేదా తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు ఇరానే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందులో 2000 నాటి ‘యుఎస్ఎస్ కోల్’ (USS Cole) నౌకపై దాడి ఘటనతో పాటు ఇతర సైనిక ఘర్షణలను ఆయన ఉదాహరించారు.
Also Read:రూ.271 కోట్లకు పెంట్‌హౌస్..రికార్డు డీల్!
గడిచిన ఐదు దశాబ్దాల్లో ఇరాన్ ప్రభుత్వం చేతిలో ప్రాణాలు కోల్పోయిన నిరసనకారుల కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలన్నారు. ఈ కౌంటర్ డిమాండ్లను రాబోయే అన్ని దౌత్య చర్చల్లో కచ్చితంగా చేర్చాలని అమెరికా ప్రతినిధులను ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ఆంక్షల తొలగింపు, యుద్ధ నష్టపరిహారం కోరుతుంటే…ట్రంప్ మాత్రం ఇరాన్‌పై భారీ బాంబు దాడులు చేస్తామని బెదిరిస్తూ చర్చలను మరింత సంక్లిష్టం చేస్తున్నారు.

