తాడిపత్రిలో హైటెన్షన్‌!

0
- Advertisement -

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలు పోటాపోటీగా నిరసన, రాజకీయ కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పట్టణంలో భారీగా టెన్షన్ వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు అప్రమత్తమై, ఇరు పార్టీల నిరసన ప్రదర్శనలకు అనుమతి నిరాకరించారు.

డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, దానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వైకాపా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద నుండి బయలుదేరడానికి సిద్ధమైన వైకాపా శ్రేణులను, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డితో పాటు వైకాపా కార్యకర్తలను ఇంట్లోకి పంపి, వారు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నాయకులను వారి ఇళ్లకే పరిమితం చేశారు.

Also Read:పెద్ది యాదిలో… కేసీఆర్ కంట కన్నీరు

మరోవైపుతాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ఇంటింటి తెలుగుదేశం’ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. జూనియర్ కాలేజీ మైదానంలోకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కార్యకర్తలకు భోజన వసతితో పాటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.ఇరు వర్గాలు పోటీపోటీగా ర్యాలీలకు పిలుపునివ్వడం, కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించడంతో పోలీసులు తాడిపత్రి పట్టణవ్యాప్తంగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా తీవ్రతరం చేశారు.

- Advertisement -