అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల ప్రాసెసింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వీసాలు, గ్రీన్ కార్డ్‌లు మరియు ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం వచ్చే అసంపూర్తిగా ఉన్న లేదా సరైన ఆధారాలు (పత్రాలు) లేని దరఖాస్తులను అదనపు ఆధారాలు కోరకుండానే నేరుగా తిరస్కరించేందుకు యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారులకు అనుమతి ఇచ్చింది.
దరఖాస్తుదారులు తమ అభ్యర్థనలను సమర్పించే సమయంలోనే తమ అర్హతలను నిరూపించుకోవాలని సంస్థ స్పష్టం చేసింది. ఒకవేళ దరఖాస్తుదారుడు తన అర్హతను నిరూపించుకోవడంలో విఫలమైనా లేదా అవసరమైన ప్రారంభ ఆధారాలన్నింటినీ సమర్పించకపోయినా USCIS ‘రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్’ (RFE) లేదా ‘నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై’ (NOID) నోటీసులను జారీ చేయకుండానే ఆ దరఖాస్తును తిరస్కరించవచ్చు.
ప్రతి ఇమ్మిగ్రేషన్ ప్రయోజనానికి అవసరమైన ఆధారాల గురించి తమ దరఖాస్తు ఫారమ్‌లు మరియు నిబంధనల మార్గదర్శకాలలో స్పష్టంగా పేర్కొన్నామని, దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే సమయంలోనే పూర్తి ఆధారాలతో సమర్పించేందుకు ఇది వీలు కల్పిస్తుందని ఏజెన్సీ తెలిపింది. ఈ విధానం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) నియంత్రణ అధికారాలకు అనుగుణంగా ఉందని, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ యొక్క పారదర్శకతను బలోపేతం చేస్తుందని మరియు అనవసరమైన/చెల్లుబాటు కాని దరఖాస్తులు చేయడాన్ని కఠినతరం చేస్తుందని USCIS పేర్కొంది.
గతంలో బైడెన్ పరిపాలన కాలంలో ప్రవేశపెట్టిన విధానాన్ని ఈ కొత్త మార్గదర్శకాలు రద్దు చేశాయి. అప్పట్లో దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ లేదా ప్రాథమిక ఆధారాలు లేనప్పటికీ వాటిని తిరస్కరించే ముందు అధికారులు RFE నోటీసులు జారీ చేయాలని ప్రోత్సహించేవారు. పాత విధానం వల్ల అసంపూర్తి లేదా లోపభూయిష్ట దరఖాస్తుల వలన మిగిలిన కేసుల ప్రాసెసింగ్ ఆలస్యమయ్యేది. అంతేకాకుండా కొంతమంది దరఖాస్తుదారులు తమ దరఖాస్తుపై నిర్ణయం వచ్చే వరకు వర్క్ పర్మిట్ (ఉపాధి అనుమతి) వంటి ప్రయోజనాలను పొందడానికి కేవలం ‘ప్లేస్‌హోల్డర్’ (నామమాత్రపు) దరఖాస్తులను సమర్పించడానికి ఆ విధానం అవకాశం ఇచ్చిందని తెలిపింది.
Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!
పాత నిబంధనలు లేదా USCIS విధానాల పరిధిలో మినహాయింపు ఉంటే తప్ప ఆగస్టు 5, 2026 నాటికి లేదా ఆ తర్వాత పెండింగ్‌లో ఉన్న అలాగే కొత్తగా సమర్పించే ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులన్నింటికీ ఇది వర్తిస్తుంది.

