సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో శాస్త్రీయ ఆధారాల కంటే సోషల్ మీడియా ద్వారా ఆరోగ్య సంబంధిత పుకార్లు వేగంగా ప్రచారమవుతుంటాయి. స్మార్ట్ఫోన్లు వాడటం వల్ల మెదడులో కణితులు వస్తాయనే భయాలు, ప్రతీ చిన్న తలనొప్పిని ప్రాణాంతకమైన వ్యాధిగా భావించే ఆందోళనలు ప్రజల్లో పెరిగిపోతున్నాయి.
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడం లేదా స్క్రీన్‌పై ఏవైనా చూడటం వల్ల మెదడు క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు అని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ ‘నాన్-అయోనైజింగ్’ రకానికి చెందింది. ఇది DNA ని దెబ్బతీయలేదు, కాబట్టి క్యాన్సర్‌కు కారణం కాదు. అయితే స్క్రీన్ సమయం ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకపోయినా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన కంటి అలసట, నిద్రలేమి, మెడ నొప్పులు, తలనొప్పి మరియు ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయి అని హెచ్చరించారు.
తలనొప్పి రాగానే చాలామంది తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు. అత్యధిక శాతం తలనొప్పులు సాధారణమైన కారణాల వల్లే వస్తాయి.మైగ్రేన్, ఒత్తిడి (Stress), డిహైడ్రేషన్ (నీరు తక్కువగా తాగడం), సైన్స్ సమస్యలు లేదా జీవనశైలి మార్పుల వల్లే ఎక్కువమందికి తలనొప్పి వస్తుంది. మెదడు కణితుల వల్ల తలనొప్పి వచ్చే కేసులు చాలా తక్కువ.
అయితే, ఈ క్రింది లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి..
తలనొప్పి తరచుగా, తీవ్రంగా రావడం
ఉదయాన్నే నిద్రలేవగానే తలనొప్పి ఎక్కువగా ఉండటం
తలనొప్పితో పాటు వాంతులు కావడం
ఫిట్స్ (మూర్ఛ), శరీర భాగాల్లో తిమ్మిర్లు, చూపు మసకబారడం లేదా ప్రవర్తనలో మార్పులు రావడం
మెదడు కణితులు కేవలం వయోవృద్ధులకు మాత్రమే వస్తాయని అనుకోవడం మరొక అపోహ. చిన్న పిల్లలతో సహా ఏ వయస్సు వారికైనా ఇవి రావచ్చు. కొన్ని రకాల కణితులు పెద్దవారిలో ఎక్కువగా కనిపించినప్పటికీ, ‘వయస్సు’ అనేది మాత్రమే ఇక్కడ కారణం కాదు. అత్యంత ప్రమాదకరమైన అపోహ ఏంటంటే – తీవ్రమైన మెదడు సమస్య ఉంటే ఖచ్చితంగా నొప్పి ఉంటుందని అనుకోవడం. నిజానికి, మెదడు కణజాలానికి నొప్పిని గ్రహించే నాడీ వ్యవస్థ (Pain receptors) ఉండదు. కాబట్టి ప్రారంభ దశలో మెదడు కణితులు ఎలాంటి నొప్పిని కలిగించకపోవచ్చు.
నొప్పి లేకపోయినా కనిపించే ఇతర హెచ్చరిక సంకేతాలు:
హఠాత్తుగా నీరసం రావడం లేదా శరీర సమతుల్యత దెబ్బతినడం
మాటలు సరిగ్గా రాకపోవడం లేదా ఇతరులు చెప్పేది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది
చూపు మసకబారడం లేదా రెండుగా కనిపించడం (Double vision)
జ్ఞాపకశక్తి తగ్గడం, తలతిరగడం లేదా ప్రవర్తనలో మార్పులు
ఫిట్స్ రావడం లేదా వరుసగా వాంతులు కావడం
Also Read:విరాళాల చోరీ..SP ఎంపీల నిరసన
బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ కాగానే జీవితం ముగిసిపోయిందని భావించడం అతిపెద్ద అపోహ. ఆధునిక వైద్యశాస్త్రంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. MRI సాంకేతికత, మైక్రోసర్జరీ, టార్గెటెడ్ థెరపీలు, రేడియో సర్జరీ, ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక వైద్య విధానాల ద్వారా ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే మెదడు కణితులను సమర్థవంతంగా నయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

