మేకదాటు ప్రాజెక్ట్ నిర్మాణంపై తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత విజయ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకదాటు ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపివేయాలని, దిగువన ఉన్న తమిళనాడు రాష్ట్ర హక్కులను కాపాడాలని కోరుతూ ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
కావేరీ నీటి వివాదం ఇప్పటికే రెండు పొరుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతోందని ఈ క్రమంలో దిగువ రిపేరియన్ రాష్ట్రం అయిన తమిళనాడు ముందస్తు సమ్మతి లేకుండా ఏ విధమైన ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి వీల్లేదని సీఎం విజయ్ తన లేఖలో పేర్కొన్నారు. మేకదాటు వద్ద ఆనకట్ట నిర్మిస్తే కావేరీ నీటిపై ఆధారపడిన తమిళనాడులోని లక్షలాది మంది రైతుల జీవనోపాధి, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కావేరీ నీటి వివాద పరిష్కార ట్రిబ్యునల్ (CWDT) మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా ముందడుగు వేయడం సరికాదని లేఖలో స్పష్టం చేశారు. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, తమిళనాడు హక్కులకు భంగం కలగకుండా చూడాలని మరియు మేకదాటు ప్రాజెక్ట్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని సీఎం విజయ్ ప్రధాని మోదీని కోరారు.
ALso Read:కొరియన్ కనకరాజు..నవ్వుతూనే ఉంటారు!
కర్ణాటక ప్రభుత్వం మేకదాటు ప్రాజెక్ట్‌ను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాయడం గమనార్హం.

