యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా:ప్రధాన్

5
- Advertisement -

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన లేఖలో ..తాను గత నాలుగు దశాబ్దాలకుపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్కరణల కోసం అంకితభావంతో పనిచేస్తూ వచ్చాను. బలమైన, సమగ్ర, పారదర్శకమైన విద్యా వ్యవస్థే శక్తివంతమైన దేశానికి పునాది అని నేను ఎప్పుడూ నమ్మాను అన్నారు.

దేశ యువత ఆశయాలు, భావోద్వేగాలు, వారి న్యాయమైన అంచనాల పట్ల నాకు అపార గౌరవం ఉంది. భారత యువత కలలను సాకారం చేయడం మనందరి రాజకీయ, సామాజిక జీవితంలోని నైతిక బాధ్యత. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అయితే, 2026 మే 3న నిర్వహించిన NEET-UG పరీక్షలో అవకతవకలు వెలుగుచూశాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అనంతరం పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించే నిర్ణయం తీసుకుంది. అలాగే, వచ్చే సంవత్సరం నుంచి ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer-Based Test – CBT) విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ మొత్తం ప్రక్రియలో 20 లక్షలకుపైగా విద్యార్థుల పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే మా ప్రధాన లక్ష్యంగా పనిచేశాము. ఇందుకోసం “హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్” (Whole of Government Approach) ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేశాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో 2026 జూన్ 21న పరీక్ష విజయవంతంగా పూర్తయింది.

మొదటి రోజు నుంచే ఈ అంశంపై నేను పూర్తి బాధ్యత తీసుకున్నాను. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ప్రతిభావంతులైన ఏ విద్యార్థి భవిష్యత్తూ పరీక్షా మాఫియా వల్ల దెబ్బతినకూడదని, ఏ విద్యార్థికీ అన్యాయం జరగకూడదని సంకల్పంతో పనిచేశాను.

జూలై 16న ప్రకటించిన NEET-UG ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయి. ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు విజయాన్ని సాధించారు.అయితే, ఈ సమయంలో కూడా కొంతమంది బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం నన్ను తీవ్రంగా కలచివేసింది.

ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పటికీ అచంచల విశ్వాసం ఉంది. యువత ఆశయాలు, కలలు, అంచనాల పట్ల నాకు అపార గౌరవం ఉంది. వారు భారత భవిష్యత్తు మాత్రమే కాదు, అభివృద్ధి చెందిన భారత నిర్మాణ శిల్పులు కూడా.గత పది రోజులుగా జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు.

భారత యువతే ఈ దేశ అసలైన శక్తి.

దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల ఉచ్చులో పడనివ్వకూడదన్నదే నా సంకల్పం.

జంతర్ మంతర్‌లో మరియు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులను దేశవ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా, దేశ ఐక్యత దెబ్బతినకుండా, ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా, మన విద్యార్థులు తమ సమయాన్ని చదువుకు, భవిష్యత్ నిర్మాణానికి వినియోగించేలా ఉండాలనే ఉద్దేశంతోనే నేను నా రాజీనామా పత్రాన్ని గౌరవనీయ ప్రధానమంత్రి గారికి పంపించాను.

గౌరవనీయ ప్రధానమంత్రి గారి మార్గదర్శకత్వం, విశ్వాసం, నిరంతర సహకారం పట్ల నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే, మంత్రివర్గ సహచరులు, మంత్రిత్వ శాఖ అధికారులు, ఉద్యోగులు మరియు నాకు కలిసి పనిచేసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.

దేశసేవే నా జీవితంలోని అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో కొనసాగుతాను.

శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో, భవిష్యత్తులో కూడా భారతమాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువత ఆశయాల సాధనకు సాధ్యమైన ప్రతి విధంగా సేవ చేయడానికి నన్ను నేను అంకితం చేసుకుంటాను అని తెలిపారు.

Also Read:దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

- Advertisement -