జింబాబ్వేతో జరిగిన తొలి T20I మ్యాచ్‌లో టీమిండియా సాధించిన ఘనవిజయం అనంతరం ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తన మనసులోని భావాలను పంచుకున్నాడు. వరుస గాయాల వల్ల ఎదురైన ఆటంకాలను అధిగమించి ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం ఎంతో సవాలుతో కూడుకున్నదని అయితే మళ్లీ నీలిరంగు జెర్సీ ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే పట్టుదలే తనను ముందుకు నడిపించిందని తెలిపాడు.
హరారే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత విజయంలో మయాంక్ కీలక పాత్ర పోషించాడు. తన కొత్త బంతితో మైదానంలో వేగపు తుఫాను సృష్టించి బ్యాటర్లను హడలెత్తించాడు. తన 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ తొలి బంతికి ప్రమాదకరమైన బ్రియాన్ బెన్నెట్‌ను అవుట్ చేయడమే కాకుండా 5వ ఓవర్లలో డియాన్ మైయర్స్ వికెట్‌ను కూడా పడగొట్టాడు.
వరుస గాయాల కారణంగా మయాంక్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఈ మ్యాచ్ భారత తరఫున అతనికి నాలుగోది కాగా గత రెండేళ్లలో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. IPL 2025 సీజన్‌లో మెజారిటీ మ్యాచ్‌లకు దూరమైన అతను, కేవలం రెండు మ్యాచ్‌ల్లో ఆడి మళ్లీ గాయపడ్డాడు. ఆ సీజన్ తర్వాత శస్త్రచికిత్స (ఆపరేషన్) చేయించుకున్న అతను, T20 ప్రపంచకప్‌నకు ముందు ‘ఇండియా A’ వార్మప్ మ్యాచ్‌ల ద్వారా పునరాగమనం చేశాడు. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 4 మ్యాచ్‌లు ఆడినప్పటికీ 11.37 ఎకానమీతో వికెట్లేమీ సాధించలేకపోయాడు.
నన్ను నేను నిలబెట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది. ముఖ్యంగా ఈ రెండేళ్ల విరామం నా వ్యక్తిగత జీవితంలో పెద్ద సవాలు. ఎందుకంటే ఆ సమయంలో నా వయస్సు నా అనుకూలంగా లేదు, అప్పటికి నాకు 22 లేదా 23 ఏళ్లు మాత్రమే అని తొలి మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేసిన అనంతరం మయాంక్ విలేకరులతో పేర్కొన్నాడు.
Also Read:వైభవ్‌పై శ్రేయాస్ ప్రశంసలు
చిన్న వయసులోనే ఇంత అనుభవించాల్సి వస్తోందనే ఆలోచన నన్ను నిరంతరం వేధించేది. అదే సమయంలో ప్రతీ క్రీడాకారుడికి చిన్ననాటి నుండి దేశానికి ఆడాలనే బలమైన కోరిక ఉంటుంది. భారత్ తరఫున తిరిగి పునరాగమనం చేసి, మెరుగైన ప్రదర్శన చేయాలనే ఆశయమే నాకు ప్రధాన శక్త్యాత్మకంగా మారింది. అని తెలిపాడు.

