దేశవ్యాప్తంగా నీట్ (NEET) నిరసనలు

1
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వైపు వెళ్తున్న నిరసనకారులపై సోమవారం పోలీసులు జరిపిన అణచివేత చర్యలకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీట్ అక్రమాలపై వివిధ నగరాల్లో విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశాయి. పాట్నాలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ (బాష్పవాయువు), వాటర్ క్యానన్లను ప్రయోగించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు, చెన్నై, సూరత్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఆందోళనలు చేపట్టారు.

పాట్నాలో జరిగిన నిరసన ప్రదర్శనలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. AISA ఆధ్వర్యంలో ‘లోక్ భవన్ మార్చ్’ చేపట్టిన విద్యార్థులు నిషేధాజ్ఞలు ఉన్న ప్రాంతంలోకి, కీలకమైన ప్రభుత్వ కార్యాలయాల వద్దకు చేరుకోవడంతో అధికారులు కొద్ది వందల మీటర్ల దూరంలో ఉన్న శాసనసభ ప్రాంగణాన్ని మూసివేశారు. దీంతో వర్షాకాల సమావేశాలకు హాజరైన ఉభయ సభల సభ్యులు లోపలే ఉండిపోవాల్సి వచ్చింది.

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలు, రాహుల్ గాంధీ పట్ల వ్యవహరించిన తీరును నిరసిస్తూ ముంబైలోని మహారాష్ట్ర బీజేపీ కార్యాలయం వైపు కాంగ్రెస్ నేతలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లలో తరలించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ నేతృత్వంలో గాంధీ భవన్ నుండి ప్రారంభమైన ఈ మార్చ్‌లో బీజేపీ కార్యాలయానికి రాజ్యాంగ ప్రతిని అందజేయాలని ప్రణాళిక రూపొందించారు. అయితే దక్షిణ ముంబైలోని రీగల్ సినిమా సమీపంలో పోలీసులు వారిని అడ్డుకుని ముందస్తుగా నిర్బంధించారు.

అలాగే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు మద్దతుగా, ఢిల్లీ పోలీసుల చర్యలను ఖండిస్తూ పలు విద్యార్థి, పౌర హక్కుల సంఘాలు బెంగళూరులో నిరసన తెలపడమే కాకుండా, పరీక్షల అక్రమాలపై ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని డిమాండ్ చేశాయి. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్, ప్రతిపక్ష నేతల నిర్బంధాన్ని ఖండిస్తూ చెన్నైలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నీట్ లీక్ అంశాన్ని వారు ప్రముఖంగా లేవనెత్తారు.

కేరళలోని పాలక్కాడ్‌లో యూత్ కాంగ్రెస్, కేరళ స్టూడెంట్స్ యూనియన్ (KSU) ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ భారీ మార్చ్ నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల నిర్బంధాన్ని నిరసిస్తూ, నీట్ పేపర్ లీక్ అంశంపై ఆందోళన చేపట్టిన గుజరాత్‌లోని సూరత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read:పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం

నీట్ పేపర్ లీక్‌పై ఢిల్లీలో నిరసన తెలుపుతున్న వారికి మద్దతుగా మిజోరంలోని ఐజ్వాల్‌లో వివిధ విద్యాసంస్థలు, పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. మిజోరం అగ్రగామి విద్యార్థి సంస్థ ‘మిజో జిర్లాయ్ పాల్’ (MZP) గురువారం కూడా ఈ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చింది.

- Advertisement -