కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని మైసూర్ రాజవంశీకులు గురువారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు మరియు అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారిని దర్శించుకున్న రాజవంశీకులకు అధికారులు ‘శ్రీవారి ప్రథమ హారతి దర్శనం’ కల్పించారు. ఆలయ అర్చకులు వారికి రంగనాయకుల మంటపంలో వేదాశీర్వచనం అందించి, శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.
మైసూర్ రాజవంశానికి..తిరుమల శ్రీవారికి యుగాల నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ క్రమంలో నిన్న మైసూర్ మహారాజా జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరువీధుల్లో ఘనంగా పల్లకీ ఉత్సవం నిర్వహించారు. శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో స్వామివారి పల్లకీ సేవ శోభాయమానంగా సాగింది. మైసూర్ సంస్థాన సాంప్రదాయాలను గౌరవిస్తూ టీటీడీ ఈ ఉత్సవాన్ని నిర్వహించడం విశేషం.
శ్రీవారి దర్శనం అనంతరం మైసూర్ రాజవంశీకులు మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నామని, రాజవంశంపై శ్రీవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
Also Read:పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం

