షారుఖ్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్

2
- Advertisement -

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నివాసం ‘మన్నత్’ (Mannat) పునర్నిర్మాణ పనులకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంబైలోని ఆయన ఐకానిక్ బంగ్లా రీమోడలింగ్‌కు అధికారులు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ కేసులో ఎలాంటి పస లేదని స్పష్టం చేస్తూ పనులను యథావిధిగా కొనసాగించుకోవచ్చని కోర్టు పేర్కొంది.

ముంబైకి చెందిన ఒక స్థానికుడు షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల సీ-ఫేసింగ్ బంగ్లాకు మున్సిపల్ అధికారులు ఇచ్చిన పునరుద్ధరణ అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. పిటిషనర్ ఉద్దేశాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. కేవలం ప్రచారం కోసమో లేదా ఇతర స్వార్థ ప్రయోజనాల కోసమో ఈ పిటిషన్ వేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. వాదనల్లో ఎలాంటి హేతుబద్ధత లేకపోవడంతో పిటిషన్‌ను తోసిపుచ్చింది. కోర్టు ఎటువంటి స్టే ఇవ్వకపోవడంతో మన్నత్ పనులు శరవేగంగా సాగనున్నాయి.

మన్నత్‌లో పెద్ద ఎత్తున రీమోడలింగ్ పనులు జరుగుతుండటంతో.. షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీ, పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్‌రామ్‌లతో కలిసి తాత్కాలికంగా ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌కు మారారు. ప్రముఖ చిత్ర నిర్మాత వాషూ భగ్నానీకి చెందిన ఈ బిల్డింగ్‌లో షారుఖ్ ఏకంగా నాలుగు ఫ్లోర్లను లీజుకు తీసుకున్నట్లు సమాచారం.

బాంద్రా వెస్ట్‌లోని బాండ్‌స్టాండ్ వద్ద ఉన్న ఈ కట్టడానికి 110 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1914లో నిర్మించిన ఈ హెరిటేజ్ (గ్రేడ్ III) ప్రాపర్టీని మొదట్లో ‘విల్లా వియన్నా’ అని పిలిచేవారు. 2001లో షారుఖ్ దీన్ని కొనుగోలు చేసి ఆ తర్వాత ‘మన్నత్’ అని పేరు మార్చుకున్నారు. దాదాపు 27,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విలాసవంతమైన బంగ్లా విలువ సుమారు రూ. 200 కోట్లు ఉంటుంది. దేశంలోనే అత్యంత ఖరీదైన సెలబ్రిటీ హోమ్స్‌లో ఇది ఒకటి. గౌరీ ఖాన్ స్వయంగా ఆర్కిటెక్ట్ కైఫ్ ఫకీహ్‌తో కలిసి దీని ఇంటీరియర్స్‌ను డిజైన్ చేశారు. ఇందులో ప్రైవేట్ థియేటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ వంటి సదుపాయాలు ఉన్నాయి.

- Advertisement -