కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయం మరోసారి హీటెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకుని నిర్వీర్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పంపింగ్ ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
“కన్నెపల్లి పంప్ హౌస్ నుండి తక్షణమే నీళ్లను లిఫ్ట్ చేయండి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా.. దానికి బాధ్యత వహిస్తూ మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా ఒకేసారి రాజీనామాలకు సిద్ధం. మీరు నీళ్లు ఎత్తిపోయకుండా వదిలేసి, ప్రాజెక్టును నాశనం చేయడానికే చూస్తున్నారు” అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, బ్యారేజీలు కూలిపోతాయంటూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఒకవేళ బ్యారేజీల సామర్థ్యంపై నమ్మకం లేకపోతే, స్వయంగా ఇంజనీర్లతో తనిఖీ చేయించి పంపింగ్ ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు.
రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తోందని, ప్రభుత్వం ఈ సవాల్‌ను స్వీకరించి తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. మరి కౌశిక్ రెడ్డి విసిరిన ఈ రాజీనామాల సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read:రేవంత్ నిర్లక్ష్యం వల్లే సుప్రీంలో చుక్కెదురు

