ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌కు భారత్ సమన్లు!

1
- Advertisement -

హార్ముజ్ జలసంధి లో యూఏఈ చమురు నౌకలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో భారతీయ నావికుడు మరణించిన ఘటనపై న్యూఢిల్లీ తీవ్రంగా స్పందించింది. ఈ దారుణ ఘటనపై నిరసన తెలియజేస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) భారత్‌లోని ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌కు అత్యవసర సమన్లు జారీ చేసింది. ఇరాన్ రాయబారి ప్రస్తుతం న్యూఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో, ఆయన స్థానంలో ఉన్న డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి భారత్ తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

ఒమన్ ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తోన్న యూఏఈకి చెందిన ‘మొంబాసా’, ‘అల్ బహియా’ నౌకలపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రేనియన్లతో కలిపి మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన రద్దీగా ఉండే ఈ సముద్ర రవాణా మార్గంలో వాణిజ్య నౌకలపై పనిచేస్తున్న భారతీయ పౌరుల భద్రత పట్ల విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే నౌకలకు, భారతీయ సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తామనే హామీని ఇరాన్ నుండి భారత్ కోరింది. భారతదేశానికి వచ్చే ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ (LNG) దిగుమతుల్లో ఎక్కువ భాగం ఈ మార్గం గుండానే వస్తుండటంతో ఇక్కడి భద్రత దేశీయ ఇంధన సరఫరాకు ఎంతో కీలకంగా మారింది.

Also Read:రేవంత్ నిర్లక్ష్యం వల్లే సుప్రీంలో చుక్కెదురు

గత కొన్ని నెలలుగా హార్ముజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్ మధ్య చెలరేగిన వివాదం అంతర్జాతీయంగా పెద్ద సంక్షోభానికి దారితీసింది. జూన్ నెలలో అమెరికా దళాలు ఒమన్ సమీపంలో మూడు వాణిజ్య నౌకలపై దాడులు చేశాయి. అమెరికా ఆదేశాలను పాటించలేదనే నెపంతో ‘ఎంటి సెట్టెబెల్లో’ నౌకపై అమెరికా యుద్ధ విమానాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. తాజా గణాంకాల ప్రకారం.. అమెరికా బలగాలు లేదా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జరిపిన దాడుల కారణంగా హార్ముజ్ జలసంధిలో ఇప్పటివరకు కనీసం ఏడుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. రెండు డజన్ల కంటే ఎక్కువ మంది గాయపడ్డారు.

భారత్ ఈ విషయంలో ఏ ఒక్క దేశానికో కొమ్ముకాయకుండా.. ఇరు దేశాల దాడులను సమానంగా తప్పుపడుతోంది. జూన్ నెలలో అమెరికా దాడులు చేసినప్పుడు కూడా భారత్ ఇలాగే దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. అమెరికా రాయబార ప్రతినిధి జేసన్ మీక్స్‌ను వారం వ్యవధిలో రెండుసార్లు పిలిపించి.. పౌర రవాణా నౌకలపై ప్రాణాంతక దాడులు చేయడం ఎంతమాత్రం అంగీకార్యం కాదని హెచ్చరించింది.

- Advertisement -