తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి సంబంధించి ఓటు హక్కుపై ఒక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనకు రాష్ట్రంలోని రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉన్నట్లు తెలుస్తోంది.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట మరియు మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో రేవంత్ రెడ్డి పేరు నమోదై ఉంది. అయితే ఇందులో అత్యంత గమనార్హమైన విషయమేమిటంటే.. ఈ రెండు చోట్లా ఆయనకు ఒకే ఎపిక్ (EPIC – TES0274035) నంబర్ ఉండడం గమనార్హం.
ఎన్నికల సంఘం (EC) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి దేశంలో ఎక్కడైనా ఒకే ఒక్క చోట ఓటు హక్కును కలిగి ఉండాలి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో లేదా నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగి ఉండడం చట్టవిరుద్ధం. ఇటీవల కాలంలో ఈ నిబంధనలను ఎన్నికల సంఘం మరింత కఠినతరం చేసింది. రెండు చోట్ల ఓటు హక్కు ఉండి, కావాలని సమాచారాన్ని దాచిపెడితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని ఈసీ ఇటీవలే స్పష్టం చేసింది.
ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండడం ఎంత తీవ్రమైన విషయమో చెప్పడానికి ఇటీవల జరిగిన ఒక ఉదాహరణను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాలలో ఓటు హక్కు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.దీనిపై రేవంత్, ఎన్నికల అధికారులు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read:రేవంత్ నిర్లక్ష్యం వల్లే సుప్రీంలో చుక్కెదురు


