NCPలో ముదిరిన విబేధాలు..!

3
- Advertisement -

NCPలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. దివంగత అజిత్ పవార్ భార్య, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్‌ను ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ సీనియర్ నేత, జాతీయ కార్యదర్శి సచ్చిదానంద్ సింగ్ లీగల్ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. 15 రోజుల్లోగా మళ్లీ కొత్తగా పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది, ఎన్నికలన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టం చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరిగిన సునేత్రా పవార్ ఎన్నిక రాజ్యాంగ విరుద్ధమని…దానికి చట్టబద్ధత లేదని సచ్చిదానంద్ సింగ్ వాదిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ‘ARS అసోసియేట్స్’ లా ఫర్మ్ ద్వారా ఆయన జూలై 9న ఒక లీగల్ నోటీసును పంపారు. ఈ నోటీసును సునేత్రా పవార్‌తో పాటు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, ప్రధాన కార్యదర్శి బ్రిజ్ మోహన్ శ్రీవాస్తవ్‌లకు పంపించారు. పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తూ, కనీసం డెలిగేట్లకు గానీ, ఆఫీస్ బేరర్లకు గానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ఎన్నికల ప్రక్రియను ముగించేశారని నోటీసులో పేర్కొన్నారు.

ఈ ఏడాది జనవరి 28న అజిత్ పవార్ మరణించిన తర్వాత ఈ వివాదం మొదలైంది.ఫిబ్రవరి 17న ఎన్‌సీపీ సవరించిన రాజ్యాంగం ప్రకారం.. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ప్రఫుల్ పటేల్‌కు మాత్రమే జాతీయ కార్యవర్గ సమావేశాన్ని పిలిచే అధికారం ఉంటుంది.ప్రఫుల్ పటేల్‌కు మాత్రమే అధికారాలు ఉన్నప్పుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి బ్రిజ్ మోహన్ శ్రీవాస్తవ్ ఫిబ్రవరి 26న ఏ అధికారంతో సమావేశాన్ని ఏర్పాటు చేశారని సచ్చిదానంద్ సింగ్ ప్రశ్నిస్తున్నారు.కేంద్ర ఎన్నికల అథారిటీ గానీ, రిటర్నింగ్ అధికారి గానీ లేకుండానే ఈ ప్రక్రియ సాగిందని, వేరే ఎవరికీ నామినేషన్ వేసే లేదా ఓటు వేసే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.

Also Read:ఇరాన్‌పై అమెరికా క్షిపణి దాడులు!

- Advertisement -