రేవంత్ నిర్లక్ష్యం వల్లే సుప్రీంలో చుక్కెదురు

5
- Advertisement -

గోదావరి–బనకచర్ల నీటి వివాదంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన సూట్ (కేసు) కొట్టివేయబడటం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యానికి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఆయనకున్న అంతర్గత కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.”సూట్ కూడా సరిగా వేయలేకపోయారు” అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం తెలంగాణకే అవమానకరమని, కావాలనే లోపభూయిష్టమైన, బలహీనమైన కేసును దాఖలు చేశారని ఆరోపించారు.

ఏపీలో గోదావరి-నల్లమల సాగర్ టెండర్లు డిసెంబర్ 11, 2025న పూర్తయితే, ప్రభుత్వం ఆలస్యంగా డిసెంబర్ 16న కోర్టును ఆశ్రయించిందని.. రిట్ పిటిషన్ కొట్టేసిన తర్వాత కూడా, ఏడు నెలల సమయం ఉన్నా బలమైన సూట్ ఎందుకు వేయలేకపోయారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా ఇంత బలహీనమైన సూట్ వేయడం సాధ్యం కాదని, రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు, తెలంగాణ జల ద్రోహి కూడా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పదవీ కాంక్ష తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకోవడానికే తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు.

ఇదే క్రమంలో దేవాదుల ప్రాజెక్టు, వరి కొనుగోళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా కేవలం 46 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందితే, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రీ-ఇంజినీరింగ్ చేసి 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని స్పష్టం చేశారు. ఈ రోజు దేవాదులకు నీరు అందుతుందంటే దానికి కేసీఆర్ నిర్మించిన సమ్మక్క బ్యారేజీయే కారణమని, తాము 30 వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తే, మిగిలిన 3 వేల ఎకరాలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ గట్టిగా నిలదీసిన తర్వాతే దేవాదుల వద్ద మోటార్లు ఆన్ చేశారని, అందులోనూ కేవలం ఆరు మోటార్లే నడుస్తున్నాయని చెప్పారు. అలాగే, తాము గతంలోనే 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేశామని, ఇప్పుడు 80 లక్షల టన్నులు కొని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కన్నెపల్లి వద్ద నీళ్లు ఉన్నా, మేడిగడ్డ వద్ద పంపింగ్‌కు అవసరమైన నీరు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని నిలదీశారు. తెలంగాణకు వెన్నుపోటు పొడిచిన ఆదిత్యనాథ్ దాస్‌ను చంద్రబాబు మాట విని సలహాదారుగా నియమించుకున్నారని ఆరోపిస్తూ, దొంగచాటు వ్యవహారాలు పక్కనబెట్టి ఢిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ సమావేశాల వివరాలను, కర్ణాటక సీఎంలతో జరిగిన భేటీ విశేషాలను తక్షణమే ప్రజల ముందు ఉంచాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -