అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్కు నోటీసులు జారీ చేసింది. అలాగే దర్యాప్తు చేపడుతున్న ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) విచారణ పురోగతిపై సమగ్ర స్థితిగతుల నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఎస్‌ఐటీ నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 20కు వాయిదా వేసింది. ఆ రోజు ఎస్‌ఐటీ నివేదికను పరిశీలించడంతో పాటు పిటిషన్లపై మరింత విచారణ చేపట్టనుంది. ఈ కేసులో రాజద్ ఎంపీ సుధాకర్ సింగ్, న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి, న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్, అలాగే హిందూ ధర్మ పరిషత్ తరఫున పిటిషన్లు దాఖలయ్యాయి. విరాళాల దుర్వినియోగంపై స్వతంత్రంగా, పారదర్శకంగా దర్యాప్తు జరపాలని వారు కోర్టును కోరారు.
గత జూన్ మొదటి వారంలో ఆలయ హుండీలలో వచ్చిన విరాళాల లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ సిఫారసు మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ)ను ఏర్పాటు చేసింది.
Also Read:ఇంగ్లాండ్‌తో వన్డేలు..టీమిండియా మార్పులు!
ఎస్‌ఐటీ విచారణలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటివరకు ఆలయంలో విరాళాల లెక్కింపుకు సంబంధించిన ప్రక్రియలో పాల్గొన్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి పాత్రపై ఎస్‌ఐటీ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.
రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం నిజానిజాలు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

