పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియపై సుప్రీం

1
- Advertisement -

అస్సాంలో విదేశీయులుగా ప్రకటించిన 27 మంది కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేసింది. పౌరసత్వం, విదేశీయుడి హోదా వంటి అంశాలు రాజ్యాంగపరంగా అత్యంత ప్రాధాన్యమైనవని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అయితే భారత పౌరసత్వాన్ని అక్రమంగా పొందేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడం ప్రభుత్వానికి ఉన్న చట్టబద్ధమైన బాధ్యతేనని సుప్రీంకోర్టు పేర్కొంది. తప్పుడు పత్రాలు, తప్పుడు వాదనలు లేదా న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసి ఎవరూ భారత పౌరసత్వాన్ని పొందకూడదని స్పష్టం చేసింది.

అయినప్పటికీ, ప్రభుత్వ ప్రయోజనాల పేరుతో న్యాయసూత్రాలను పక్కనపెట్టకూడదని కోర్టు తేల్చిచెప్పింది. ప్రతి కేసును చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా పరిశీలించాల్సిందేనని పేర్కొంది.ఈ కేసులో గౌహతి హైకోర్టు, విదేశీయుల ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సంబంధిత 27 మంది కేసులను తిరిగి ట్రైబ్యునళ్లు విచారించాలని ఆదేశించింది. అప్పటి వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

Also Read:ఇంగ్లాండ్‌తో వన్డేలు..టీమిండియా మార్పులు!

ఈ 27 మందిలో సబిత్రి దే, అజ్‌బహర్ అలీ, మహ్మద్ అక్బర్ అలీ, అబేదా ఖాతూన్, అనోవారా ఖాతూన్ తదితరులు తమ పేర్ల స్పెల్లింగ్‌లలో స్వల్ప తేడాలు, పాత ఓటరు జాబితాల్లో టైపింగ్ తప్పులు వంటి సాంకేతిక కారణాలతోనే విదేశీయులుగా ప్రకటించారని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం వారికి తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ, వారు నిజంగా భారత పౌరులేనా అనే అంశాన్ని ఈ దశలో పరిశీలించలేదని స్పష్టం చేసింది. కేసులోని ఆధారాలను ట్రైబ్యునళ్లు మరోసారి సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించింది.

- Advertisement -