ఎన్నికల నిర్వహణలో భారతదేశం తన ప్రపంచవ్యాప్త పాత్రను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎన్నికల నిర్వహణలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇండోనేషియాతో ఒక అవగాహన ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఈ ఒప్పందం ద్వారా ఎన్నికల సాంకేతికతను పంచుకోవడం, దేశాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (EVMలు), శిక్షణ, సామర్థ్య పెంపు, సంస్థాగత సహకారం మరియు ఇరు దేశాల ఎన్నికల అధికారుల మధ్య ఉత్తమ పద్ధతుల మార్పిడి వంటివి జరగనున్నాయి.
భారీ ఎత్తున ప్రజాస్వామ్య ఎన్నికలను నిర్వహించడంలో భారతదేశానికి ఉన్న నైపుణ్యానికి అంతర్జాతీయంగా లభిస్తున్న గుర్తింపునకు ఈ భాగస్వామ్యమే నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.జకార్తాలో జరిగిన ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో మాట్లాడుతూ.. తమ దేశం భారతదేశ ఎన్నికల సంఘం నుండి ఎంతో నేర్చుకుంటోందని చెప్పారు. ఇన్నేళ్లుగా భారతదేశం శాంతియుతంగా ఎన్నికలను నిర్వహిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు.
మేము భారత ఎన్నికల సంఘాన్ని చాలా నిశితంగా పరిశీలించి నేర్చుకుంటున్నాము అని అన్నారు. వేర్వేరు భాషలు, సమాజాలు ఉన్న 1.4 బిలియన్ల (140 కోట్లకు పైగా) జనాభా కలిగిన దేశంలో ఎన్నికలను నిర్వహించగల భారతదేశ సామర్థ్యం ఒక అద్భుతమైన విజయమని ఆయన అభివర్ణించారు. భారతదేశం ఎన్నో ఏళ్లుగా శాంతియుత పద్ధతిలో ప్రభుత్వ మార్పిడిని (అధికార బదిలీని) నిర్వహించడాన్ని మేము చూస్తున్నాము. ఇది ఒక అద్భుతమైన విజయం. నేను కూడా దీనిని అధ్యయనం చేస్తున్నాను మరియు భారతదేశం సాధించిన ఈ గొప్ప విజయాలను గమనిస్తున్నాను అని తెలిపారు.
Also Read:వీడియో..రిల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం
భారత్లో తయారైన ఈవీఎంలను ఇప్పటికే భూటాన్, నేపాల్, నమీబియా వంటి దేశాలలో ఉపయోగిస్తున్నారు లేదా పరీక్షిస్తున్నారు. అలాగే భారతదేశానికి చెందిన చెరగని సిరా (ఓటు వేసాక పెట్టే చుక్క) ను మడగాస్కర్, మయన్మార్, కంబోడియా, ఫిజీ, భూటాన్, సియెర్రా లియోన్ మరియు మంగోలియా వంటి దేశాల ఎన్నికల కోసం సరఫరా చేశారు.

