డిజిటల్ ఇండియా..11 ఏళ్ల ప్రస్థానం!

2
- Advertisement -

భారతదేశాన్ని సాంకేతికంగా సాధికారత వైపు నడిపిస్తున్న ప్రతిష్టాత్మక ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం విజయవంతంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని సామాన్య పౌరుల జీవితాల్లో మరియు సుపరిపాలనలో డిజిటల్ ఇండియా చూపిన ప్రభావం నిజంగా విప్లవాత్మకమైనదని, అద్భుతమైన మార్పులను తీసుకువచ్చిందని ఆయన కొనియాడారు.

2015 జూలై 1న ప్రారంభమైన ఈ పథకం, గత 11 ఏళ్లలో దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ మరియు డిజిటల్ సేవలను చేర్చడంలో కీలక పాత్ర పోషించిందని ప్రధాని గుర్తుచేశారు. ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేయడం ద్వారా పారదర్శకత పెరిగిందని, అవినీతి తగ్గిందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ అవతరించడానికి యూపీఐ సాంకేతికత ప్రధాన కారణమని… ఇది ఆర్థిక చేరికను సాధ్యం చేసిందని ప్రధాని తెలిపారు. ఆధార్, డిజిలాకర్, కోవిన్ , ఉమాంగ్ వంటి యాప్‌ల ద్వారా ప్రభుత్వ సేవలు నేరుగా ప్రజల మొబైల్‌లకే చేరుతున్నాయని మోదీ పేర్కొన్నారు.

‘భారత్ నెట్’ ద్వారా వేలాది గ్రామ పంచాయతీలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించి, గ్రామీణ భారతాన్ని డిజిటల్ యుగంలోకి నడిపించినట్లు వివరించారు.భారతదేశం కేవలం సాంకేతికతను ఉపయోగించుకునే దేశంగానే కాకుండా, సరికొత్త డిజిటల్ ఆవిష్కరణలతో ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), 5G/6G సాంకేతికతలతో డిజిటల్ ఇండియా మరిన్ని రికార్డులను సృష్టిస్తుందని ఆకాంక్షించారు.

Also Read:పవన్‌తో పూజా హెగ్డే రొమాన్స్!

- Advertisement -