గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)’ చట్టం, 2025 (VB-G RAM G Act) బుధవారం (జులై 1) నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. దీనికి అనుగుణంగా సవరించిన నూతన వేతన రేట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దేశంలోని అన్ని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వేతన ప్రాంతాలలో ఈ పెంచిన కూలి రేట్లు జులై 1 నుండి వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇప్పటివరకు ఉపాధి హామీ (MGNREGA) కింద రోజుకు రూ. 298.8 గా ఉన్న జాతీయ సగటు వేతనం.. ఇప్పుడు నూతన ‘విబి-జి రామ్ జి’ చట్టం కింద రోజుకు రూ. 327.4 కి పెరిగింది. అంటే సగటున రోజుకు రూ. 28.6 చొప్పున కూలి పెరిగింది. దేశంలో ఎక్కడా కూడా నోటిఫైడ్ వేతనం రూ. 300 కంటే తక్కువ ఉండకూడదనే ఉద్దేశంతో రూ. 300 ల కొత్త తాత్కాలిక బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా సగటు వేతన రేట్లు 10 శాతానికి పైగా పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా, పాత చట్టం ప్రకారం ఏడాదికి 100 రోజులు ఉన్న ఉపాధి కాలాన్ని, ఈ కొత్త చట్టం ద్వారా అర్హులైన గ్రామీణ కుటుంబాలకు గరిష్టంగా 125 రోజుల ఉపాధికి చట్టబద్ధమైన హామీని కల్పించారు.
గతంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో రోజువారీ కూలి రూ. 300 కంటే తక్కువగా ఉండేది (అత్యంత తక్కువగా రోజుకు రూ. 241 ఉండేది). అయితే తాజా నిర్ణయంతో 21 రాష్ట్రాలు/పరిపాలనా విభాగాలను కొత్తగా రూ. 300 బేస్ వేతన పరిధిలోకి తీసుకువచ్చారు.
Also Read:పవన్‌తో పూజా హెగ్డే రొమాన్స్!
ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో వేతనాలు 15% నుండి 25% వరకు పెరిగాయి.అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో అత్యధికంగా దాదాపు 24.5% శాతం మేర వేతనాలు పెరిగాయి.గతంలో తక్కువ వేతనాలు ఉన్న రాష్ట్రాలకే ఈ కొత్త విధానం ద్వారా ఎక్కువ లబ్ధి చేకూరేలా దీనిని రూపొందించారు.ఈ కొత్త విధానంలో పనులు అడ్డంకులు లేకుండా సాగడానికి మరియు సకాలంలో వేతన చెల్లింపుల కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వం తాత్కాలిక కేటాయింపుల కింద రూ. 95,692.31 కోట్లను విడుదల చేసింది.

