వైకో నేతృత్వంలోని మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కజగం (MDMK) పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. డీఎంకే (DMK) నేతృత్వంలోని ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్’ (SPA) కూటమి నుండి తాము వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. భవిష్యత్తులో ఎన్నికల పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది.
శనివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ (సాధారణ సర్వసభ్య) సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
తమిళనాడులో “మతతత్వ రాజకీయ శక్తులు” బలం పుంజుకోకుండా చూసేందుకు, ద్రావిడ ఉద్యమ సూత్రాలను కాపాడేందుకు ఎండీఎంకే గత తొమ్మిదేళ్లుగా డీఎంకే కూటమిలో కొనసాగుతూ వచ్చింది.
అయితే, ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో, 32 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న ఎండీఎంకే స్వతంత్ర రాజకీయ గుర్తింపును బలహీనపరిచేందుకు కూటమిలోనే కొన్ని ప్రయత్నాలు జరిగాయని అయినప్పటికీ తాము కూటమి ధర్మాన్ని పాటించి ఎన్నికల్లో పోటీ చేశామని పార్టీ పేర్కొంది.
ఎన్నికల తదనంతర రాజకీయ పరిణామాలు ప్రజల తీర్పుకు విరుద్ధంగా సాగాయని ఎండీఎంకే ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47 స్థానాలు గెలుచుకున్న ఏఐఏడీఎంకే (AIADMK)ను హిందుత్వ మతతత్వ శక్తులతో కలిపి అధికారంలోకి తీసుకురావడానికి కొన్ని తెరవెనుక ఏర్పాట్లు జరిగాయని, ఇది అందరికీ తెలిసిన రహస్యమని తీర్మానంలో పేర్కొన్నారు. దీనివల్ల ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్’ సిద్ధాంతాలు, ఆదర్శాల పునాదిపై ఏర్పడిన కూటమి అనే మాటకు అర్థం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read:‘వారణాసి’ అప్డేట్ ఇచ్చిన జక్కన్న!
ఈ నేపథ్యంలో తాము ఇకపై డీఎంకే కూటమిలో కొనసాగకూడదని పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు అభిప్రాయపడటంతో కూటమి నుంచి తప్పుకోవాలని జనరల్ కౌన్సిల్ నిర్ణయించింది.

