దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీల ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ సింగ్ . గత ఏప్రిల్లో రాఘవ్ చద్దా నేతృత్వంలో ఆప్ కి చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరిన తర్వాత రాజ్యసభలో ఆప్ తరపున మిగిలిన ముగ్గురు ఎంపీలలో సంజయ్ సింగ్ ఒకరు. తృణమూల్ కాంగ్రెస్ (TMC), శివసేన (UBT) వంటి ప్రాంతీయ పార్టీలలో ఇటీవలి చీలికల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇటీవల వివిధ ప్రతిపక్ష పార్టీలలో జరుగుతున్న వరుస చీలికలపై సంజయ్ సింగ్ స్పందిస్తూ.. ఇది కొత్తేమీ కాదన్నారు. గతంలో ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలను బీజేపీ ఇలాగే చీల్చిందని గుర్తుచేశారు. ఈడీ (ED), సీబీఐ (CBI) సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను భయపెట్టడం…తమ పార్టీలో చేర్చుకోవడం బీజేపీ నైజమని విమర్శించారు.
ప్రాంతీయ పార్టీలే తమకు ప్రధాన సవాలు అని బీజేపీ భావిస్తోందని వాటిని పూర్తిగా ముగించి…కాంగ్రెస్ను మాత్రమే ఏకైక ప్రత్యర్థిగా ఉంచాలనేది వారి వ్యూహమని ఆరోపించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్, నియోజకవర్గాల పునర్విభజన అమల్లోకి వస్తే పరిమిత వనరులు ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం అసాధ్యమని పేర్కొన్నారు. తమ పార్టీ ఎంపీల విలీనానికి వ్యతిరేకంగా రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ కు రెండు లేఖలు రాశామని, దీనిపై చట్టపరంగా పోరాడుతామని చెప్పారు.
ఎంపీల ఫిరాయింపుల వల్ల ఆప్ సంస్థకు లేదా మద్దతుదారులకు పైసా నష్టం జరగలేదని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. పంజాబ్లో ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఢిల్లీలో కూర్చున్న పాలకులు తమపై అరాచకాలు చేయడాన్ని, తమ పార్టీని చీల్చడాన్ని పంజాబ్ ప్రజలు సహించరని, అందుకే వారు తమకు మరింత అండగా నిలిచారని చెప్పారు. 2029 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఈ ఆర్థిక పరిస్థితులే కారణమవుతాయన్నారు. అలాగే సమాజ్వాదీ పార్టీ (SP) లో కూడా చీలికలు రాబోతున్నాయనే వార్తలను ఆయన నిరాధారమైనవిగా కొట్టిపారేశారు.
Also Read:Stock crash:ఐటీ షేర్లు..ఢమాల్
నీట్ (NEET) పేపర్ లీకేజీలపై స్పందిస్తూ 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సంక్షోభంపై స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) లక్ష్యాలు మంచివని సంజయ్ సింగ్ కొనియాడారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ ఫిరాయింపుల అంశాన్ని గట్టిగా లేవనెత్తుతామని సంజయ్ సింగ్ తెలిపారు. ఒక గుర్తుపై…ఒక నాయకుడిని చూసి ప్రజలు ఓట్లేస్తే, గెలిచిన తర్వాత పార్టీ మారడం ప్రజలను వంచించడమేనన్నారు. పదవి కాలం ముగిసేవరకు పార్టీ మారకుండా కఠినమైన చట్టం తేవాలన్నారు.

