ప్రతిపక్ష పార్టీల ఐక్యతను బలహీనపరిచింది కాంగ్రెస్నేనని ముఖ్యంగా రాహుల్ గాంధీ రాజకీయ పరిపక్వతపై ప్రశ్నలు లేవనెత్తుతూ డీఎంకే అధికార పత్రిక మురసొలి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అమృతం బదులు ఇండియా కూటమి నుంచి విషం ఉత్పత్తి అయితే ఆ విషాన్ని తొలుత కలిపింది ఎవరు? అని ప్రశ్నించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ….అనంతరం ఆ కూటమిని వీడి నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది కాంగ్రెస్. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి.
జూన్ 8న న్యూఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…మిత్రపక్షాల విమర్శలను కాంగ్రెస్ స్వీకరించాలని, శివుడు విషాన్ని మింగినట్లుగా వాటిని భరించాలని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మురసొలి….పురాణ కథలో శివుడు విషాన్ని సృష్టించలేదు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు విషం బయటపడింది. ప్రపంచాన్ని రక్షించేందుకు శివుడు దానిని మింగాడు అని పేర్కొంది.
అదే ఉపమానాన్ని ఉపయోగిస్తూ ప్రస్తుతం ఇండియా కూటమిలో ఏర్పడిన విభేదాలకు కాంగ్రెస్ పార్టీ కూడా కారణమా కాదా అని ప్రశ్నించింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష ఐక్యతపై ఉపన్యాసాలు ఇస్తున్నారు. రాష్ట్రాల వారీగా ఈ ఐక్యతను బలహీనపరిచింది ఆయనే కాదా? అని సంపాదకీయంలో ప్రశ్నించారు.
Also Read:తనపై జరిగిన దాడి..విన్యాసమే:అభిజిత్
కాంగ్రెస్ ప్రేమ, ఆప్యాయతలతో మిత్రపక్షాలను ఏకం చేస్తుందని రాహుల్ చెప్పినప్పటికీ…పార్టీ రాజకీయ వ్యవహార శైలి మాత్రం అందుకు భిన్నంగా ఉందని డీఎంకే అభిప్రాయపడింది. చివరగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆయన ఒక పెద్ద జోక్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

