హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా ఆర్మీకి చెందిన ‘అపాచీ’ యుద్ధ హెలికాప్టర్ సోమవారం కుప్పకూలింది. అయితే విమాన రెస్క్యూ బృందం తక్షణమే స్పందించి హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు:ఈ అపాచీ అటాక్ హెలికాప్టర్ కూలిపోవడానికి గల అసలు కారణం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఇది సాంకేతిక లోపం వల్ల కూలిందా…వాతావరణ పరిస్థితుల వల్లనా లేక ఇరాన్ దళాల దాడి వల్ల జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై వైట్ హౌస్ లేదా యూఎస్ మిలిటరీకి చెందిన సెంట్రల్ కమాండ్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బలహీనపడుతున్న తరుణంలో ఈ ప్రాంతంలో తీవ్ర భద్రతా ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఇటీవల జరిగిన పరస్పర సైనిక దాడుల ఉధృతి తగ్గిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం.
మరోవైపు రాబోయే రెండు వారాల్లో ఇరాన్‌పై అమెరికా సంపూర్ణ విజయం సాధిస్తుందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేసిన తరుణంలోనే ఈ భద్రతా పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో కొత్త అణు ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, వాషింగ్టన్ యొక్క వ్యూహాత్మక డిమాండ్లకు లొంగిపోవడానికి అవతలి పక్షం సిద్ధంగా ఉందని ఒక ప్రచార కార్యక్రమంలో ట్రంప్ పేర్కొన్నారు.
Also Read:హెచ్-1బి వీసా దారులకు గుడ్‌న్యూస్

