భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ తొలి రోజున భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ చేసిన ఓ తెలివైన చర్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్పష్టంగా ఎడ్జ్ అయినప్పటికీ అఫ్గానిస్థాన్ జట్టు డీఆర్ఎస్ తీసుకోకపోవడంతో రాహుల్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. దీనిపై మాజీ ఇంగ్లండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ సరదాగా స్పందిస్తూ రాహుల్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ 11వ ఓవర్ తొలి బంతికి అఫ్గాన్ బౌలర్ జియౌర్ రహ్మాన్ షరీఫీ షార్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ వేశాడు. రాహుల్ బలమైన కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బ్యాట్‌కు బంతి తగిలిన స్పష్టమైన శబ్దం వినిపించింది. అఫ్గాన్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ ప్రకటించాడు.
డీఆర్ఎస్ తీసుకోవాలా వద్దా అనే విషయంపై అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తన సహచరులతో చర్చించాడు. వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్ ఎలాంటి శబ్దం వినలేదని చెప్పడంతో రివ్యూ తీసుకోలేదు. అయితే మరో ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ మాత్రం రివ్యూ తీసుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
Also Read:లోక్‌సభకు మమతా బెనర్జీ!
ఈ సమయంలో రాహుల్ తన బ్యాట్‌కు బంతి తగలలేదన్నట్లుగా తల ఊపుతూ, ఎలాంటి ఎడ్జ్ లేదన్న భావాన్ని కల్పించాడు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా అఫ్గాన్ ఆటగాళ్లను ప్రభావితం చేసినట్లు కనిపించింది. తర్వాత రీప్లేల్లో స్పష్టమైన ఎడ్జ్ కనిపించడంతో అఫ్గానిస్థాన్ జట్టు నిరాశ చెందింది.

